Ragipindi Rava Upma in Telugu : ఉదయం టిఫిన్లలోకి ఎప్పుడూ ఇడ్లీ, దోశెలు కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఉందా? అయితే, ఆరోగ్యంతో పాటు భిన్నమైన రుచిని అందించే రాగి ఉప్మా ట్రై చేసి చూడండి! మీ కుటుంబీకులు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. రాగి పిండితో జావ తాగే వారు రుచి కోసం ఇలా రాగి పిండి ఉప్మా చేసుకుంటే నోటికి రుచితో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి
రాగి పిండి ఉప్మా కావాల్సిన పదార్థాలు
- రాగి పిండి - 1 కప్పు
- ఉప్మా రవ్వ - 1 కప్పు
- నూనె - 2 స్పూన్లు
- నెయ్యి - 1 స్పూన్
- జీడిపప్పు - గుప్పెడు (ఆప్షనల్)
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- పోపు దినుసులు - 1 టీ స్పూన్
- ఎండు మిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ
- అల్లం - కొద్దిగా
- ఉల్లిగడ్డ - 1 మీడియం సైజు
- పచ్చి మిరపకాయలు - 3
- టమోటా - 1 మీడియం సైజు
- కొత్తి మీర - తరుగు
- ఉప్పు - రుచికి సరిపడా
- నీళ్లు - 4 కప్పులు
రాగి పిండి ఉప్మా తయారీ విధానం
- పొయ్యిపై కడాయి పెట్టుకుని నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. వేడి నూనెలో జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ప్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. (జీడి పప్పు తప్పని సరి కాదు)
- అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులతో పాటు 2 ఎండు మిర్చి, కరివేపాకు వేసుకుని చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్క తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మగ్గించాలి.
- మూడు పచ్చి మిరపకాయలు నిలువుగా చీలుకుని వేసుకోవాలి. అవన్నీ మెత్తగా ఉడికేందుకు ఉప్పు వేసుకుని వేపుకోవాలి.
- ఆ తర్వాత టమోటో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.
- పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించాలి. టమోటా మగ్గిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రాగి పిండి కూడా వేసుకుని రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
- స్టవ్ మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని నాలుగు కప్పుల నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి.
- రవ్వ, రాగి పిండి కలిపి రెండు కప్పులు ఉంటుంది కాబట్టి నాలుగు కప్పుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది.
- ఒకవేళ ఉప్మా పొడిపొడిగా రావాలంటే మూడు కప్పుల నీళ్లు సరిపోతాయి.
- ఉడికిస్తూనే ఉప్పు రుచి చూసుకోవాలి. సరిపోకపోతే మరో సారి ఉప్పు వేసుకోవాలి
- మూత పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి.
- చివరగా కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకుంటే సరిపోతుంది.
- ఈ ఉప్మాలో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి అలంకరించుకోవచ్చు.
- రాగి ఉప్మా పల్లీ చట్నీ లేదా నాన్ వెజ్ కర్రీల్లోకి చాలా బాగుంటుంది.
- పెరుగు, మజ్జిగ పోసుకుని కూడారుచి చూడొచ్చు.
కరకరలాడే "పెరుమాళ్ వడలు" - అచ్చం తిరుపతి "వడ ప్రసాదం" రుచి!
పిండిలో ఈ ఒక్కటి వేస్తే చాలు - చపాతీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయి!