Phone Use On Toilet : ఫోన్ అనేది మనిషి శరీరంలో ఒక భాగంలా మారిపోయింది. ఫోన్ లేనిదే ఇంటి నుంచి బయటికి ఎవరూ అడుగుపెట్టడం లేదు. నిత్యం ఫోన్‌ను చూడనిదే ఎవరూ ఉండలేకపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అంతగా ఫోన్‌కు బానిసలుగా మారిపోతున్నారు. కొందరైతే టాయిలెట్‌కు కూడా ఫోన్‌ను తీసుకెళ్తున్నారు. ఫోన్‌ను చూస్తూ చాలా సేపు టాయిలెట్‌లో కూర్చుండి పోతున్నారు. అలాంటి వారికి హెమోరాయిడ్స్ (పైల్స్), అనల్ ఫిస్టులా (భగందర పుండు) వంటి సమస్యలు వస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు. చాలాసేపు టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుంది. దానిలో నొప్పి కలుగుతుంది. ఒక్కోసారి తప్పకుండా వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. తగిన పోషకాహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా మలద్వారం భాగం బలహీనంగా తయారవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీలైనంత త్వరగా బయటికి రావాల్సిందే!
దిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఈఎస్ఐసీ ఆస్పత్రిలో జరిగిన 74వ వ్యవస్థాపక దినోత్సవంలో డాక్టర్ జిగ్నేశ్ గాంధీ ప్రసంగించారు. ఆయన సీనియర్ రోబోటిక్ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్. ప్రస్తుతం ముంబైలోని గ్లెన్ ఈగల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ చాలా సేపు కూర్చోవడాన్ని జిగ్నేశ్ తప్పుపట్టారు. అసలు అందులోకి ఫోన్ తీసుకెళ్లడమే సరికాదన్నారు. వీలైనంత త్వరగా మల, మూత్ర విసర్జన ప్రక్రియను పూర్తి చేసుకొని టాయిలెట్ నుంచి బయటికి రావడం మంచిదని ఆయన సూచించారు. ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చొని ఫోన్ చూసేవారిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జిగ్నేశ్ గాంధీ చెప్పారు.
ఏడాది వ్యవధిలో పెద్దసంఖ్యలో కేసులు
ముంబైలోని గ్లెన్ ఈగల్స్ ఆస్పత్రిలో సర్జరీ స్పెషలిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ రవి రంజన్ సైతం ఈ అంశంపై స్పందించారు. "టాయిలెట్‌లో అతిగా ఫోన్ చూస్తూ కూర్చునే వారికి హెమోరాయిడ్స్ (పైల్స్), ఫిస్టులా సమస్యలు వస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో మేం ఇలాంటి 500కు పైగా కేసులను నిర్ధరించాం. నీళ్లు తక్కువగా తాగడం, జంక్ ఫుడ్ తినడం, టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చొనిపోవడం వంటి అలవాట్లే ఈ సమస్యలకు దారితీస్తున్నాయి" అని ఆయన వివరించారు. "ఇలాంటి సమస్యలు కలిగిన వారు పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా క్యూ కడుతున్నారు. బాధితుల్లో ఏర్పడిన హెమోరాయిడ్స్ (పైల్స్)కు రఫేలో పద్ధతిలో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా చిన్నపాటి చికిత్స చేస్తున్నారు. ఈక్రమంలో రోగికి నొప్పి తెలియకుండా ఉండేందుకు, తక్కువ మోతాదులో మత్తు మందును కూడా అందిస్తున్నారు. సగటున 20 నిమిషాల్లోనే ఈ చికిత్సపూర్తవుతుంది. గ్రేడ్ 2, 3, 4 స్థాయి హెమోరాయిడ్స్ (పైల్స్)కు ఈ తరహా చికిత్స సరిపోతుంది. దీన్ని చేసే క్రమంలో కాస్తంత నొప్పి, అసౌకర్యం కలుగుతాయి. చికిత్స చేసిన రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు" అని డాక్టర్ రవి రంజన్ వివరించారు. "రఫేలో చికిత్సా పద్ధతికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం ఉంది. యూకే జాతీయ ఆరోగ్య సేవల విభాగం కూడా దీన్ని అనుసరిస్తుంది" అని ఆయన తెలిపారు. "నాలుగేళ్ల క్రితమే భారత్‌లోనూ రఫేలో చికిత్సా పద్ధతిని పరిచయం చేశారు. చాలా మంది సర్జన్లకు నేటికీ ఈ చికిత్సా పద్ధతిపై అంతగా అవగాహన లేదు" అని రవి రంజన్ వెల్లడించారు.
అక్కడ నొప్పి కారణంగా వాపు
"కొంత మంది మలబద్ధకం సమస్య కారణంగా టాయిలెట్‌లో చాలా సేపు కూర్చుంటారు. దీనివల్ల వారికి మలద్వారం భాగంలో సమస్యలు వస్తుంటాయి. అక్కడ నొప్పి కారణంగా వాపు వస్తుంటుంది. చివరకు హెమోరాయిడ్స్, ఫిస్టులా వంటి సమస్యలు కలుగుతుంటాయి" అని గురుగ్రామ్‌లోని మరేంగో ఏషియా హాస్పిటల్ సర్జన్ డాక్టర్ బీర్బల్ తెలిపారు. ఈ తరహా సమస్యలతో దేశంలోని ఈఎస్ఐసీ ఆస్పత్రులు, వివిధ ఎయిమ్స్‌లలో పెద్దసంఖ్యలో బాధితులు చేరుతున్నారు. అయితే వాటిలో సరిపడా పడకలు, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేక, చికిత్సను అందించడంలో జాప్యం జరుగుతోంది. ఈ సౌకర్యాలు ఏవీ అక్కరలేకుండా సాదాసీదాగా హెమోరాయిడ్స్ (పైల్స్), అనల్ ఫిస్టులా (భగందర పుండు)లకు రఫేలో చికిత్స చేయొచ్చని డాక్టర్లు అంటున్నారు. తద్వారా ఒక్కో ఆస్పత్రిలో రోజూ సగటున 40 నుంచి 50 మంది బాధితులకు చికిత్స చేయవచ్చని చెబుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా చేసే రఫేలో చికిత్సపై డాక్టర్లకు అవగాహన పెరగాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల ఆస్పత్రులపై ఈ తరహా రోగుల భారం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.