Male Migrant Laborers Planting Rice : రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. విస్తీర్ణం పెరుగుతున్న సమయంలోనే కూలీల కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రైతులు నాట్లు వేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి నాట్లు జోరందుకున్న వేళ ఇతర రాష్ట్రాల నుంచి మగ కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుందని రైతులు వలస కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.
వలస కూలీలతో వరి నాట్లు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. గ్రామాల్లో ఎంత తిరిగినా సరే సకాలంలో కూలీ మనుషులు దొరకట్లేదు. ఒకవేళ దొరికిన వారంతా పొలం దగ్గరికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి. ఫలితంగా వరి నాట్లు ఆలస్యమైతే దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూలీల కొరతతో విసిగి వేసారిన రైతులు గత నాలుగేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కూలిలను రప్పించి నాట్లు వేయిస్తున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్, అసోం, పశ్చిమబంగాల్ నుంచి వచ్చిన మగ కూలీలు తమదైన పని తీరుతో దూసుకెళ్తున్నారు. వలస కూలీల కష్టాన్ని మెచ్చిన కర్షకులు గుత్తాలెక్కన వారికే పనిని అప్పగిస్తున్నారు.
రైతులు హర్షం :నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో వలస కూలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు నారు అందిస్తుండగా మిగిలిన వారు నాట్లు వేస్తున్నారు. ఒకేసారి 10 నుంచి 20 మంది మగ కూలీలు పొలంలోకి దిగి గంటన్నరలోపే ఎకరం పొలంలో నాటేసే పనిని పూర్తిచేస్తున్నారు. స్థానిక కూలీలు రోజంతే చేసే పనిని ఈ కూలీలు గంటల వ్యవధిలోనే ముగించేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఎకరాకు నాలుగు నుంచి ఐదువేల వరకు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి చీకటిపడే వరకు పొలంలోనే ఉంటున్నారు. రోజుకు ఆరెకరాల నుంచి 8 ఎకరాలు పూర్తి చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కూలీల వల్ల ఖర్చు తగ్గడంతో పాటు సకాలంలో నాట్లు పూర్తవుతున్నాయని చెబుతున్నారు.
వలస కూలీలపై ఆసక్తి :సాధారణంగా స్థానిక కూలీలు ఉదయం 10 గంటలకు నాట్లేయడం ప్రారంభించి సాయంత్రం 6 గంటలకే ఇంటికెళ్తారు. వీరికి రవాణా ఖర్చులు కూడా రైతులే చెల్లించాలి. అంతే కాకుండా నారు అందించే బాధ్యత కర్షకుల మీదే పెడుతున్నారు. దీంతో స్థానిక కూలీలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోందని వలస కూలీలపై ఆసక్తి చూపుతున్నారు. అందుకే కొందరు మధ్యవర్తులు ఇతర రాష్ట్రాల కూలీలను తీసుకొచ్చి వారికి నివాసంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నారు. మధ్యవర్తిగా ఉన్నందుకు కమిషన్‌తో పాటు ఇతర ఖర్చులు తీసుకుంటున్నారు. తమ రాష్ట్రంలో కంటే ఇక్కడే ఎక్కువ సంపాదిస్తున్నామని వలస కూలీలు అంటున్నారు. ఖర్చులు పోను నెలకు 30వేల వరకు మిగులుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడి రైతులు, ప్రజలు తమను బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి నాట్లు జోరు అందుకున్నాయి. రైతులు వలస కూలీల వద్దకు వరస కడుతున్నారు.
"ఇక్కడ కూలీల కొరత ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలతో వరి నాట్లు వేయిస్తున్నాను. ఎకరానికి కూలీల ఖర్చు చాలా తక్కువ అవుతుంది. పనిని చాలా తొందరగా ముగిస్తారు." - వరి రైతు