Grama Sabalu in Telangana : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డుసభల్లో చెదురుమదురు గొడవలు మినహా తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వేతో అర్హుల గుర్తింపులో అక్కడక్కడ నిరసనలు వ్యక్తమమ్యాయి. జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వారికి భరోసా కల్పించారు. మంగళవారం మెుదలైన ఆ సభలు నెల 24వ తేదీతో ముగియనున్నాయి.
రేషన్‌కార్డుల జారీ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీకి చేపట్టిన సర్వే మంగళవారం మెుదలై ఈ నెల 24న ముగియనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. అక్కడకక్కడ గొడవలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయి. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కొందరి వ్యక్తుల వ్యక్తిగత విషయాలతో చిన్నపాటి గొడవ జరిగింది.
గ్రామసభల్లో వాగ్వాదం : మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల గ్రామసభల్లో వాగ్వాదం చోటుచేసుకుంది. జాబితాలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు ఎందుకు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. పదేళ్లు పౌర సరఫరాల మంత్రిగా ఉండి ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని గంగులపై సుడాఛైర్మన్ నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరైన ఆయన అర్హులందరికీ పథకాలందేలా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు సూచించారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను కలెక్టర్ పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు భారీగా హాజరై ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తుల్జారంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఫోటోలు లేవంటూ స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గ్రామసభ రసాబాసాగా మారింది.
నిజమైన అర్హులకు పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన జాబితాను పునః పరిశీలించాలని తెలిపారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన గ్రామసభల్లోని జాబితాలో అనర్హులున్నారని అర్హులకు అవకాశం ఇవ్వలేదని స్థానిక గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా తడకమళ్ళలో రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు అధికంగాఉన్నాయని అధికారులను గ్రామస్థులు నిలదీశారు. జాబితాలో ఉన్న ఉద్యోగస్థులు, భూస్వాముల పేర్లతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి నిరసన వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా వేపలసింగారంలో పాల్గొన్న కలెక్టర్ నందాలాల్ నాలుగు పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు.
మహానగరపాలక సంస్థ పరిధిలో ఆఊసే లేదు : రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామసభల్లో లబ్దిదారులని ఎంపిక చేస్తుంటే హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఆఊసే లేదు. సర్వేపూర్తి కాకపోవడం వల్లే పూర్తి స్థాయిలో వార్డు సభలు నిర్వహించట్లేదని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ, కుంట్లూరులో నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తుదారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోవాలా? - ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి
'లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా లేదు' - గ్రామ సభ నుంచి వెళ్లిపోయిన స్థానికులు