Success Story Of Organic Farmer Venkataswamy : జీవితంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కటిక దరిద్రుడైనా పట్టుదలతో పనిచేస్తే కోటీశ్వరుడు కావచ్చు. ఎంత డబ్బున్న వారైనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే దరిద్రుడిగా మారవచ్చు. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ కోటికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి 30 ఏళ్ల కిందట ఓ నిరుపేద. యజమాని ఎగతాళిని ప్రేరణగా తీసుకొని ఇప్పుడాయన కోటీశ్వరుడిగా మారాడు. సొంతంగా కుట్టుమిషన్ పెట్టి నలుగురుకి ఉపాధినిస్తున్నాడు. మరోవైపు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మట్టిని ముడితే బంగారం అవుతుందని నిరూపించారు.
వెంకటస్వామి వయస్సు 55 సంవత్సరాలు. 30ఏళ్ల కిందట కుటుంబ పోషణ కోసం ఆదిలాబాద్‌లోని ఓ వడ్రంగి దుకాణంలో దినసరి కూలీగా చేరారు. ఓ రోజు ఆయన బంధువొకరు అతన్ని కలిసేందుకు దుకాణం వద్దకు రాగా బయటకి వెళ్లి టీ తాగి వస్తానని యజమానిని కోరారు. అందుకు యజమాని అంగీకరించకపోగా బంధువు ఎదుటనే మీకు చుట్టాలున్నారా? అని ప్రశ్నించారు. కళ్లల్లో నీళ్లుతిరిగిన వెంకటస్వామి అదేరోజు పనిమానేశారు.
తనే యజమానిగా మారి కుట్టుమిషన్ దుకాణం తెరిచి మరో ఐదుగురికి ఉపాధి కల్పించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీలో ఓ ఫాంహౌస్ ఏర్పాటు చేశారు. సేంద్రీయ ఎరువులతో ఆధునిక పద్ధతిలో సాగుచేయడం ప్రారంభించారు. ఇప్పుడది ఫలాలు అందిస్తున్న కల్పతరువుగా మారింది. ఫాంహౌస్‌తోపాటు కుట్టుమిషన్ పనిని నిర్వహిస్తున్న వెంకటస్వామి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వెంకటస్వామి తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్దకుమారుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా చిన్నబ్బాయి హైకోర్టులో అడ్వకేట్. సెలవుల్లో వారు ఇంటికి వస్తూ వ్యవసాయక్షేత్రంలో పని చేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఫాంహౌస్‌లో వచ్చిన ఫలాలు, కూరగాయలు ఇప్పటివరకు ఎవరికీ విక్రయించలేదు. ఉచితంగానే ఇస్తున్నట్లు తెలిపారు.
"నేను పని చేసే చోట చుట్టాలను కలవడానికి బయటికి వెళ్తానని అంటే మీకు కూడా చుట్టాలుంటారా అని యజమాని అవమానించాడు. ఆ తర్వాత అక్కడ పని మానేసి సొంతంగా కుట్టుమిషన్ షాపు పెట్టాను. నాతో పాటు నలుగురుకి ఉపాధి కల్పించాను. ఇప్పుడు ఫామ్ హౌస్‌లో రకరకాల పంటలు సాగు చేస్తున్నాను. మా కుమారులను చదివిపించాను. ఇప్పుడు పెద్ద కుమారుడు సాఫ్ట్‌వేర్‌గా, చిన్న కుమారుడు హైకోర్టులో అడ్వకేట్‌గా ఉద్యోగం చేస్తున్నారు." -వెంకటస్వామి, రైతు
ఆక్వా బిజినెస్‌లో యువ రైతు సూపర్ సక్సెస్- రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం! యూత్‌కు ఇన్స్పిరేషన్!
అద్దె కట్టలేక రైల్వే ప్లాట్ ఫామ్‌పై నిద్ర - కట్ చేస్తే బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా!