Trump On Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మరికొద్ది రోజుల్లో భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్‌లో విలేకరులకు వెల్లడించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌లో సంక్షోభం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
'పుతిన్ చాలా తెలివైన వ్యక్తి'
"యుద్ధం అనేది అసలు మొదలు కాకూడదు. నేను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌లో సంక్షోభం వచ్చేది కాదు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు త్వరలో ముగింపు పలుకుతా. కీవ్‌లో శాంతి ఒప్పందంపై చర్చలకు రష్యా రాకపోతే ఆంక్షలు విధిస్తా. మాస్కో ఎప్పుడూ ఉక్రెయిన్‌ను ఆక్రమించేది కాదు. పుతిన్‌తో నాకు చాలా బలమైన అవగాహన ఉంది. ఆయన తెలివైన వ్యక్తి. ఆయనకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అంటే గౌరవం లేదు. పుతిన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా" అని ట్రంప్ పేర్కొన్నారు.
శాంతి ఒప్పందం జరగాలని కోరుకుంటున్నారు!
అదే సమయంలో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా కొనసాగిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా, ట్రంప్ బదులిచ్చారు. తాము దానిని పరిశీలిస్తున్నామని, ఆ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడుతున్నామని తెలిపారు. శాంతి ఒప్పందం జరగాలని ఆయన బలంగా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియాకు వెళ్తా: ట్రంప్
మరోవైపు, అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్‌ట్రంప్ పశ్చిమాసియా పర్యటించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే బందీలు తిరిగి వస్తున్నందున ఇప్పుడే కాదన్నారు. బందీలు విడుదల క్రెడిట్ తనకే దక్కుతుందన్నారు. తాను అధికారంలోకి రాకుంటే బందీలు విడుదలయ్యే వారు కాదని ట్రంప్ పేర్కొన్నారు. వారంతా చనిపోయేవారన్నారు. ఇది ఏడాది ముందే జరిగి ఉంటే ఈ ఒప్పందం జరగటానికి బైడెన్‌కు ఏడాదిన్నర లేదా రెండేళ్లు పట్టేందన్నారు. అక్టోబర్ 7లాంటి దాడి ఎప్పుడూ జరగకూడదని ట్రంప్ అన్నారు. ఆర్నేళ్ల ముందు ఈ ఒప్పందం జరిగి ఉంటే ఎంతోమంది యువత చనిపోయేవారు కాదన్నారు. తాను గడువు విధించటం వల్లనే ఒప్పందం జరిగిందని, లేకుంటే బైడెన్ వల్ల అయ్యేది కాదన్నారు. మధ్యప్రాచ్యంలోని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని ట్రంప్ స్పష్టం చేశారు.