Karnataka Road Accident : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. కూరగాయలు, పండ్లతో వెళ్తున్న లారీ లోయలో పడిపోవడం వల్ల ఉత్తర కన్నడ జిల్లాలోని అరబైల్ ఘాట్‌లోని కాగేరి పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం వేకువజామున జరిగిందీ దుర్ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పండ్లు, కూరగాయలతో హావేరి జిల్లా సవనూరు నుంచి కుంటలోని సంతకు వెళ్తున్న లారీలో 40 మందికి పైగా వ్యాపారులు ఉన్నారు. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో వెనుక నుంచి వస్తున్న వాహనానికి దారి ఇచ్చేందుకు లారీని ఎడమవైపునకు తిప్పాడు డ్రైవర్. దీంతో లారీ అదుపుతప్పి 50మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. అందులో ఉన్నవారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరమణించారు.
రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన 16 మందిని యల్లాపూర్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
మృతులు వీరే!
మృతులను ఫయాజ్ ఇమామ్ జమఖండి (45), వసీం (35), ఇజాజ్ ముస్తాకా ముల్లా (20), సాదిక్ భాషా (30), గులామ్ షేన్ జవాలి (40), ఇంతియాజ్ ములకేరి (36), అల్పాజ్ జాఫర్, మందక్కి (25), జిలానీ అబ్దుల్ (25), అస్లాం బెన్ని (24)గా పోలీసులు గుర్తించారు.
కుక్కపిల్లను కాపాడే ప్రయత్నంలో ట్రక్కును ఢీకొట్టిన కారు- ముగ్గురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టడం వల్ల మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఝాన్సీ- లలిత్‌పుర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగిందని, కారు డ్రైవర్ కుక్కపిల్లని కాపాడే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఝాన్సీ జిల్లా చిర్గావ్ ప్రాంతంలోని సియా గ్రామానికి చెందిన కరణ్ విశ్వకర్మ అనే వ్యక్తి మంగళవారం లలిత్‌పుర్‌కు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో వస్తుండగా వారి వాహనానికి అకస్మాత్తుగా కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో కుక్కను కాపాడేందుకు ప్రయత్నించగా కారు అదుపుతప్పి పక్కనే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులందరి వయసు 20-25 ఏళ్ల లోపే ఉంటుంది. నుజ్జునుజ్జైన కారులో చిక్కుకున్న మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసి పోస్టుమార్టం పరీక్షలకు తరలించారు.