Deputy CM Pawan Kalyan met CM Chandrababu at Secretariat in AP :ఏపీసచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో బ్లాక్‌లో తన ఛాంబర్ ను పరిశీలించిన అనంతరం పవన్ సచివాలయం మొదటి బ్లాక్‌కు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సచివాలయంలో తన ఛాంబర్‌కు వచ్చిన పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో పాటు సీఎంను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కలిశారు.
సీఎం ఛాంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తరవాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మంత్రివర్గ భేటీ ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అదేవిధంగా గురువారం(రేపు) ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
నీటి పారుదల శాఖ అతిథి గృహం డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు విజయవాడలోని నీటిపారుదలశాఖ అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ- శాస్త్ర సాంకేతిక మంత్రిగా గురువారం సచివాలయంలో పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
హైదరాబాద్ నుంచి ఇవాళ ఉదయం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడలోని ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పవన్‌కల్యాణ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహాన్ని పవన్ కల్యాణ్ నిశితంగా పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా పవన్ వెంట ఉన్నారు. రెండు అంతస్తుల ఈ అతిథి గృహంలో పై అంతస్తులో నివాసం, దిగువ అంతస్తులో కార్యాలయం ఏర్పాటుపై చర్చించారు.