Fake Doctors In Hyderabad : కొన్ని అంతరాష్ట్ర ముఠాలు నగరంలో వృద్దులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా ప్రార్ధన మందిరాలు, ఉద్యానాలకు వచ్చే వృద్దులతో మాటలు కలిపి వ్యాధుల గురించి సమాచారం సేకరిస్తారు. తెలిసిన వైద్యులు ఉన్నారని వారి వద్ద చికిత్స తీసుకుంటే ఎంతటి జబ్బులైనా తగ్గిపోతాయని నమ్మిస్తారు. ఇలా నకిలీ డాక్టర్లు హైదరాబాద్‌లో చాలా మందిని మోసం చేసి లక్షల్లో డబ్బులు కాజేశారు.
ఆయుర్వేద మందులు ఇప్పిస్తానంటూ : తాజాగా బంజారాహిల్స్‌లో ప్రొస్టేట్ సమస్యతో భాదపడుతున్న వృద్దుడికి ఆయుర్వేద మందులు ఇప్పిస్తానంటూ 20లక్షలు కొట్టేశాడు. అబిడ్స్‌లో తలనొప్పి భాదిత మహిళ వద్ద మాయగాడు రూ.40వేలు తీసుకొని విటమిన్ మాత్రలు ఇచ్చారు.
కాలిలో చీము తీస్తానని మోసం : స్కందగిరి పరిధిలో వయోధికుడు కుంటుతూ నడవటం ఆ మోసగాడు గమనించాడు. అతడి వద్దకెళ్లి నడకలో మార్పునకు కారణాలు అడిగి తెలుసుకున్నాడు. కాలిపై ఉన్న పుండును బేగంబజార్‌లోని వైద్యుడు తగ్గిస్తాడంటూ నమ్మేలా చేశాడు. ఇంటి అడ్రస్ తీసుకొని రెండు రోజుల తర్వాత వెళ్లి కాలిలో చీము తొలగించాడు. భవిష్యత్తులో ఈ సమస్య రాదని భరోసా ఇచ్చాడు. వైద్యానికి రూ.2లక్షలు ఖర్చవుతాయని తెలిపాడు.
వైద్యం పేరిట మోసం : ఇదంతా నమ్మిన అతడు ఆరోగ్యం కన్నా డబ్బులు ముఖ్యంకావు అనుకొని రూ. 2 లక్షలు ఇచ్చాడు. మళ్లీ తెల్లవారుజామున బాధితుడి కాలి నుంచి చీము కారడంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పద్మారావునగర్‌లో విశ్రాంత ఉద్యోగి అనారోగ్యాన్ని నయం చేస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి వైద్యం పేరిట రూ.1.60 లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
"హైదరాబాద్‌లో అంతరాష్ట్ర నేరగాళ్లు వృద్దులే లక్ష్యంగా వైద్యం పేరిట మోసానికి పాల్పడుతున్నారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. తెలియనివారు వైద్యం, మందులు ఇస్తామంటూ చెప్పే మాటలు నమ్మొద్దు. ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు దగ్గర్లోని ఆసుపత్రకి వైద్యం చేసుకోవాలి. అపరిచితుల మాటలు నమ్మి మాత్రలు, సిరఫ్‌లు తీసుకుంటే చేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నట్లే." -బి. అనుదీప్, ఇన్స్పెక్టర్, చిలకలగూడ
మీ బస్తీలో ఉన్న డాక్టర్ నకిలీ కావొచ్చు! - ఫీజు తక్కువని నాడి చూపిస్తే ప్రాణాలు గాల్లోకి!!
ఫేక్ డిగ్రీలతో ట్రీట్మెంట్ చేస్తున్నారు! - ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి