Yograj On Kapil Dev : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ను చంపేందుకు పిస్తోల్‌తో తన ఇంటికెళ్లిన సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన యోగ్రాజ్ ఈ విషయం బయటపెట్టాడు.
తనను జట్టులోంచి తప్పించినందుకు కపిల్ దేవ్‌ను యోగ్రాజ్ చంపాలనుకున్నాడట. అంతేకాదు పిస్తోల్‌తో కపిల్ దేవ్ ఇంటికెళ్లాడట. 'కపిల్ దేవ్ టీమ్ఇండియా కెప్టెన్ అయ్యాక, ఎలాంటి కారణం లేకుండా నన్ను జట్టు నుంచి తప్పించాడు. దీంతో నా భార్య, కపిల్‌ను ఈ విషయంపై ప్రశ్నించాలని అనుకుంది. కానీ నేనే కపిల్‌కు బుద్ధి చెప్పి వస్తానని ఆమెతో చెప్పి, నా పిస్తోల్ తీసుకుని కపిల్ దేవ్ ఇంటికెళ్లా. అతడు వాళ్ల అమ్మ, సోదరుడితో కలిసి బయటకు వచ్చాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టేశా. 'నీ కారణంగా నేను క్రికెట్ కోల్పోయాను. నీ తలలో బుల్లెట్ పేల్చాలని ఉంది. కానీ, అలా చేయను. ఎందుకంటే నీకు ఓ తల్లి ఉంది' అని అతడితో చెప్పి తిరిగి వచ్చేశా. ఇక జీవితంలో క్రికెట్ ఆడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను' అని యోగ్రాజ్ పేర్కొన్నాడు.