Kumbh Mela 2025 Arrangements : భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం కలగలిపి 12ఏళ్లకోసారి వచ్చే కుంభమేళా కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 45 కోట్ల మంది యాత్రికులు తరలివచ్చే ఈ మహత్తర సందర్భాన్ని పురష్కరించుకుని భారత పర్యాటకశాఖ దేశీ, విదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించింది. ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈసారి ప్రపంచ పర్యాటక వేదికగా మారుస్తామని కేంద్ర పర్యటక శాఖ స్పష్టం చేసింది.
టూర్ ప్యాకేజీలు
దేశీ, విదేశీ పర్యటకానికి ఊతమివ్వడమే లక్ష్యంగా అనుసంధానతను సులభతరం చేసినట్లు పర్యటక శాఖ తెలిపింది. దేశంలో అన్ని ప్రముఖ నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమాన కనెక్టివిటీని మెరుగుపరచేలా అలయన్స్ ఎయిర్‌తో పార్ట్‌నర్‌షిప్ డీల్ కుదుర్చుకున్నట్లు వివరించింది. యాత్రికుల ప్రయాణాన్ని సురక్షితం, సులభతరం, ఆహ్లాదకరంగా మార్చేలా అన్ని రకాల వసతుల వివరాలను అందించేలా UP టూరిజం డిపార్ట్‌మెంట్, IRCTC, ITDC వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్యురేటెడ్ టూర్ ప్యాకేజీలు, లగ్జరీ వసతి ఎంపికలను అవి అందిస్తున్నాయని టెంట్ సిటీ సహా విలాసవంతమైన శిబిరాలు, ఇతర లగ్జరీ ఎంపికలను అవి డిజిటల్ బ్రోచర్‌ల రూపంలో అందుబాటులో ఉంచుతాయని పేర్కొన్నారు.
10 భాషల్లో టోల్‌ఫ్రీ నంబర్స్
ప్రవాసులు, విదేశీ పండితులు, పరిశోధకులు, పర్యటకులు, ఫోటోగ్రాఫర్‌లు, జర్నలిస్టుల సౌకర్యం కోసం ప్రయాగ్‌రాజ్‌లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్‌క్రెడిబుల్ ఇండియా పెవిలియన్‌ను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఇక్కడ దేశ సాంస్కృతిక వారసత్వం, కుంభమేళా విశిష్టతను వివరించేలా ప్రదర్శనలను నిర్వహించనున్నారు. విదేశీ అతిథుల కోసం 1.3.6.3 నంబర్‌తో టోల్ ఫ్రీ ఇన్ఫో లైన్‌ను పర్యటక శాఖ ఏర్పాటు చేసింది. ఇంగ్లిష్, హిందీ, ఇతర భారతీయ భాషలతో పాటు 10 ప్రముఖ విదేశీ భాషలలో ఇది సేవలందించనుంది.
కుంభమేళా వైభవం, ఆధ్యాత్మిక సారాంశాలని ప్రతిబింబించేందుకు, అలాగే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో యాత్రికులను భాగస్వామ్యం చేస్తామన్న పర్యటక శాఖ- #మహాకుంభ్2025, #స్పిరిచ్యువల్ ప్రయాగ్‌రాజ్ వంటి ట్యాగ్‌లతో తమ అనుభవాలను పోస్టు చేయాలని సూచించింది. పెద్ద ఎత్తున ఫోటోషూట్, వీడియోగ్రఫీ ప్రాజెక్టును చేపట్టి జాతీయ, అంతర్జాతీయ మీడియా వేదికల్లో సాంస్కృతిక గమ్యస్థానంగా ప్రయాగ్‌రాజ్ పర్యాటక సామర్థ్యాన్ని హైలైట్ చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.