Conflict Between Mlas : కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్‌లో ఆదివారం (జనవరి 12న) నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు తోసుకోవడం సంచలనం రేపింది. పోలీసులు జోక్యం చేసుకుని హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మాట్లాడుతుండగా వచ్చిన సమస్య : జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమవుతుండగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలుగజేసుకుని మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్‌కు మైక్ ఇవ్వొద్దని కౌశిక్‌రెడ్డి హల్‌చల్ చేశారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వకూడదని సంజయ్ ప్రశ్నించగా, ఏ పార్టీనో ముందు చెప్పి మాట్లాడాలని కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ మైక్‌లో మాట్లాడుతుండగా అడ్డుకున్నారు.
"ఈరోజు జరిగిన ఈ సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను రాష్ట్రంలో బహుశా చాలా అనుభవం కలిగిన ప్రజా ప్రతినిధిని. నేను వరుసగా 7 సార్లు గెలిచా ఎమ్మెల్యేగా, ఎంపీగా. ఇటువంటి ప్రవర్తన ఎక్కడా చూడలేదు. ఇది అధికారిక మీటింగ్. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అందరూ ప్రజాప్రతినిథులను మేమే ఆహ్వానించి మాట్లాడాలని కోరాం. మరి వారిని అడ్డుకొని, దీనిని రాజకీయ ప్రసంగం వైపు తీసుకెళ్లడం, అపరిపక్వంగా వ్యవహరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి ప్రవర్తన సరైంది కాదనీ తెలియజేస్తున్నాను" -మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
పోలీసులు కలుగజేసుకునే వరకు : ఈ క్రమంలోనే ఇరువురు నాయకుల మధ్య మాటా మాటా పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడే ఉన్న నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు లాక్కెళ్లారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎదుటే ఈ గొడవ జరిగింది. అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఉద్రిక్తంగా మారిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ ధర్నా - అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిక!