Viart Kohli Ranji : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా, స్టార్ ప్లేయర్లంతా డొమెస్టిక్ టోర్నీలో ఆడుతున్నారు. రోహిత్, జైస్వాల్, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా రీసెంట్గా రంజీ ట్రోఫీలో ఆడారు. కానీ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రం మెడనొప్పి కారణంగా బరిలోకి దిగలేదు. అయితే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రంజీలో ఇంకో రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రౌండ్‌లోనైనా విరాట్ బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అటు దిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో దిల్లీ తలపడనుంది. అయితే గత మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన దిల్లీ, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఆశిస్తోంది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ ఆయుష్ బదోని ఒక్కడే రాణించగా, పంత్ విఫలమయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీపై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది.
దాదాపు 13ఏళ్ల తర్వాత డొమెస్టిక్ బరిలోకి దిగుతున్న విరాట్‌ను చూసేందుకు భారీగా అభిమానులు స్టేడియానికి తరలి వస్తారని దిల్లీ అసోసియేషన్ భావిస్తోంది. దీంతో భద్రతను పెంచాలని నిర్ణయించింది. సుమారుగా 10వేల మందికిపైగా ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తోంది. అందుకు కోసం నార్త్ ఎండ్, ఓల్డ్ క్లబ్ హౌస్‌ను ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యిందట. అవసరమైతే అదనపు సీటింగ్ సిద్ధం చేయనుంది. కాగా, ఈ మ్యాచ్‌కు ఎలాంటి టికెట్ అవసరం లేకుండా, ప్రతి ఒక్కరు స్టేడియంలో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించనుంది.