Special Officers Appointed Municipalities : తెలంగాణలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పదవీ కాలం ఆదివారం ముగిసింది. దీంతో ఈ రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. రాష్ట్రంలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరగగా, అదే నెల 27వ తేదీన పాలక మండళ్లు కొలువుతీరాయి. దీంతో ఆదివారం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియనుంది. దీనికి కూడా ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు.
ప్రత్యేక అధికారుల పాలన : మరోవైపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ 2021 ఫిబ్రవరిలో పాలకవర్గం ఏర్పడింది. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు, ఇంకా కొన్ని మున్సిపాలిటీలకు కూడా పదవీకాలం మరో ఏడాదిపైనే ఉంది. బాహ్యవలయ రహదారి వరకూ హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7కార్పోరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వీటి పరిధిలోని 51 పంచాయితీలను ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనం చేసింది. జీహెచ్ఎంసీలో విలీనం చేయబోయే సంస్థలను పక్కనబెట్టి పదవీకాలం పూర్తయినవాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
పంచాయతీలు, జిల్లా పరిషత్ ఎన్నికలు : పంచాయితీలు, జిల్లా పరిషత్‌ల పదవీకాలం ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. ప్రజలు సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. పిబ్రవరి చివరి వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని సమాచారం. గ్రామ పంచాయితీ ఎన్నికలు పూర్తికాగానే ఈ ఒకటి, రెండు నెలల్లో మున్సిపాలిటీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు - రెడీగా ఉండండి : కార్యకర్తలకు సీఎం రేవంత్ సూచన