Drugs Caught in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. లంగర్‌హౌస్, హుమాయున్‌నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌తో కలిసి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
డ్రగ్ పెడ్లర్లు వచ్చినట్లు సమాచారం : టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధింద్ర తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేయడానికి డ్రగ్ పెడ్లర్లు వచ్చినట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో లంగర్ హౌస్ పోలీస్, నార్కోటిక్ పోలీసుల ద్వారా జాయింట్ ఆపరేషన్ చేశామన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒలివర్ ఉగచుక్వో అలియాస్ జాన్సన్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ఆఫ్రికా దేశానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
1300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ : జాన్సన్ దిల్లీ నుంచి బెంగళూరుకు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నైజిరియన్స్తో పరిచయం చేసుకొని హైదరాబాద్, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. 1300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడు ఒలివర్ అలియాస్ జాన్సన్‌ను కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. మరో కేసులో పాత నేరస్తుడు గన్యా దేశస్తుడైన మౌస కామ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మాదకద్రవ్యాల కేసులో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు తెలిపారు.
నైజీరియన్లతో పరిచయం : గతంలో మౌస కామ్రా కొకైన్‌తో ముంబయి పోలీసులకు పట్టుబడి ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2020 లో ఇతను వైద్య చికిత్సల కోసం వీసా పొంది దాని ద్వారా నగరానికి చేరుకున్నాడు. మాదకద్రవ్యాలు సరఫరా చేసే మరికొంత మంది నైజీరియన్లతో పరిచయం ఏర్పడడంతో ఇతను కూడా మాదకద్రవ్యాల విక్రేతగా మారాడు. ఈ క్రమంలోనే కొకైన్ తరలిస్తూ ముంబయి పోలీసులకు పట్టుబడి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించి విడుదలయినట్టు పోలీసులు తెలిపారు.
స్వదేశానికి పంపిస్తాం : ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ మరోసారి మాదకద్రవ్యాలను సరఫరా చేయడం ప్రారంభించినట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధింద్ర తెలిపారు. హైదరాబాద్‌కు కూడా సరఫరా చేసేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. మరో కేసులో వీసా, పాస్ పోర్టు గడువు తీరినప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటున్న నైజీరియాకు చెందిన ఓకేచుక్కు 2012లో బిజినెస్ వీసాపై ముంబాయికి వచ్చాడు. వీసా కాలం చెల్లినప్పటికీ అక్కడే నివసిస్తుండడంతో 2019 లో నవి ముంబయిలో తలోజ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక కొందరు స్నేహితులతో కలిసి హుమాయున్‌నగర్‌లో నివసిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తిరిగి అతన్ని స్వదేశానికి పంపనున్నట్టు పోలీసులు తెలిపారు.
స్వలింగ సంపర్కులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా - ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు