Traffic Rules Violation 311 Times In Bengaluru : ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతీ వాహనదారుడి బాధ్యత. కానీ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుదీప్ అనే ద్విచక్ర వాహనదారుడు ఏకంగా 311 సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు. హెల్మెట్ ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, వన్ వే డ్రైవింగ్, అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై 311 కేసులు నమోదయ్యాయి. అయినా చిక్కడు, దొరకడు అన్నట్టుగా అతగాడు తప్పించుకు తిరిగాడు. ఈ వివరాలతో శిబం అనే వ్యక్తి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడం వల్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు.
సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 3న (సోమవారం) సుదీప్‌ను పట్టుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి నమోదైన మొత్తం 311 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులకు సంబంధించి రూ.1,61,500 జరిమానా విధించారు. వెంటనే ఆ ఫైన్ వసూలు చేశారు కూడా. అంతేకాదు సుదీప్ వినియోగించిన వాహనాన్ని కింద సీజ్ చేశారు. ఆ వ్యక్తిపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలు గతేడాది నాటికి రూ.1,05,500 మాత్రమే ఉన్నాయి. అవి ఈ ఏడాది ఏకంగా రూ.1,61,500కు చేరాయి. ఈ అంశంపై సుదీప్‌కు నోటీసులు పంపినా బేఖాతరు చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
@citymarkettrps ಒಟ್ಟು 311 ಸಂಚಾರ ನಿಯಮ ಉಲ್ಲಂಘನೆ ಪ್ರಕರಣಗಳನ್ನು ಬಾಕಿ ಉಳಿಸಿಕೊಂಡಿರುವ ಯಮಹ ಪ್ಯಾಸಿನೋ ಸ್ಕೂಟರ್ ಸಂಖ್ಯೆ: KA-05-JX-1344 ರ ಮಾಲೀಕರನ್ನು ದಿನಾಂಕ:03.02.2025 ಪತ್ತೆ ಮಾಡಿ ವಾಹನವನ್ನು ಠಾಣಾ ವಶಕ್ಕೆ ಪಡೆದಿಕೊಂಡಿದ್ದು, #Bravo pic.twitter.com/UaLLjdrbfp
— DCP TRAFFIC WEST (@DCPTrWestBCP) February 4, 2025
ఇలా పట్టుకున్నారు
బెంగళూరులోని సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు- ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ ద్విచక్ర వాహనదారుడిని సోమవారం రోజు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇన్నాళ్లూ సుదీప్ వినియోగించిన టూ వీలర్ పెరియ స్వామి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. దీంతో పెరియ స్వామికి పోలీసులు లీగల్ నోటీసులు పంపారు. ఆ టూవీలర్‌తో సుదీప్ చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారాన్ని నోటీసుల్లో ప్రస్తావించారు.