Dastagiri Petition on Avinash Reddy Bail :మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఇదే కేసులో నాలుగో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును ఉల్లంఘించిన అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లా పులివెందుల మండలం నామాలగుండు గ్రామంలో తన తండ్రిపై ఈ నెల 8న రాత్రి అవినాష్ రెడ్డి అనుచరులు ముగ్గురు హత్యాయత్నం చేశారన్నారు. ఈ దాడిలో తన తండ్రి తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
సీబీఐ రక్షణ కేసులో సాక్షిగా ఉన్న తనకు మాత్రమే ఉంటుందని, కుటుంబానికి కాదని దస్తగిరి (Ex MP Viveka Murder Approver Dastagiri) పేర్కొన్నారు. తన తండ్రిపై హత్యాయత్నం ద్వారా తనను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. వేరే నేరంలో జైలులో ఉన్నప్పుడు అవినాష్ అనుచరులు తనను హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. తరువాత బెయిలుపై విడుదలయ్యాక సీబీఐ రక్షణ కల్పించడంతో తనను బెదిరించడం సాధ్యం కాక కుటుంబసభ్యులపై దాడికి దిగి తనను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సాక్ష్యం లేకుండా కీలకమైన ఈ కేసును రుజువు చేయడం కష్టమవుతుందన్నారు.
ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలి - హైకోర్టులో దస్తగిరి పిటిషన్
Ex MP Viveka Murder Case Update : ఇతర కేసుల్లో తాను కడప కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలు సూపరింటెండెంట్‌ను ప్రభావితం చేసి నవంబరు 28న మెడికల్ క్యాంపయిన్ పేరుతో జైల్లోకి వచ్చారని దస్తగిరి తెలిపారు. రూ.20 కోట్లతో నేరుగా ఎస్ఎస్ఆర్ వద్దకు వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనను కలిశారని తెలిపారు. ఇక్కడికి తనంతట తానే వచ్చానని అవినాష్ రెడ్డి, సీఎం జగన్, వైఎస్ భారతి రెడ్డిలు తమ పక్కన ఉన్నారని వారి కోసం తాము ఎవర్నయినా ఏం చేయడానికైనా సిద్ధమని చైతన్యరెడ్డి హెచ్చరించినట్లు వెల్లడించారు.