Task Force Committees to Determine Food Poisoning Causes in Gurukulas : గురుకులాల్లో వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఘటన జరిగిన శాఖ అధిపతి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా అధికారి టాస్క్ఫోర్స్లో సభ్యులుగా నియమించింది. ఆహార కల్తీ జరిగినప్పుడు వెంటనే తనిఖీ చేసి, కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, ఇద్దరు సిబ్బందితో ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ కిచెన్లో పరిశుభ్రత పరిశీలించిన తర్వాతే వంట చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వంట పూర్తయ్యాక ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు రుచి చూసిన తర్వాత విద్యార్థులకు వడ్డించాలని స్పష్టం చేసింది. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. పర్యవేక్షకులు కూడా పిల్లలకు భోజనం పెట్టే ముందు, కిచెన్లో పరిశుభ్రత తనిఖీ చేసి, భోజనం రుచి చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఉద్యోగంలో నుంచి తీసేస్తాం : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాలు తనిఖీ చేయాలని పలుమార్లు కలెక్టర్లను ఆదేశించినప్పటికీ, ఇలాంటి ఘటనలు జరగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని, ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడంతో పాటు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని సీఎం తెలిపారు. విద్యార్థుల కోసం అనేక సానుకూల నిర్ణయాలను తీసుకుంటున్నప్పటికీ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సీఎం తెలిపారు. బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టించేలా ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ - 24 మంది విద్యార్థులకు అస్వస్థత
ఫుడ్ పాయిజన్ అయిందా? డాక్టర్ వద్దకు వెళ్లేముందు ఇంట్లో ఇలా చేస్తే బిగ్ రిలీఫ్!