CM Revanth Reaction To Union Budget 2024 :కేంద్ర బడ్జెట్‌ట్‌లో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులతో కలిసి ఇప్పటికే 18 సార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేసినా, రాష్ట్రానికి అన్యాయమే చేశారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు నిర్ణయం వల్లే మోదీ ప్రధాని అయ్యారన్న సీఎం, 35 శాతం ఓట్లు, 8 సీట్లిచ్చిన ప్రజల పట్ల కృతజ్ఞత చూపించలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర హక్కులపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కేంద్రానికి నిరసన తెలుపుతారని స్పష్టం చేశారు.
"ఈ బడ్జెట్‌కు సంబంధించి రేపటి శాసనసభలో పూర్తి స్థాయి చర్చలు పెడతాం. ఎవరు ఎటువైపు ఉన్నారు, విలీనాల ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారు? చీకటి ఒప్పందాలకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇవన్నీ కూడా రేపటి శాసనసభలో తెలుస్తుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్ అనుమతితో ఈ చర్చపై ముందుకు వెళ్తాం. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సైతం కలిసి రావాలి." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉంది :కేవలం కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారని ధ్వజమెత్తారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు, కుర్చీ బచావో బడ్జెట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్‌లో బిహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులివ్వలేదని సీఎం విమర్శించారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదు తెలంగాణకూ వర్తిస్తుందని వెల్లడించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి తప్ప, రాష్ట్రానికి చేసేదేం లేదని మండిపడ్డారు. వికసిత భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే , ఆయన మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.