CM Revanth Reddy on Professor Jayashankar Jayanthi :ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. గతంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ వ్యతిరేకించారని తెలిపారు. ఏపీలో విలీనంతో జరిగిన అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
KCR On Professor Jayashankar Jayanthi : సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే జయశంకర్‌కు మనం అందించే ఘన నివాళి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని వారు తెలంగాణ కోసం చేసిన కృషి, త్యాగాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి దాకా శాంతియుత పద్ధతిలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించి, అరవై ఏళ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం ప్రజల మద్దతుతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఆచార్య జయశంకర్ స్పూర్తితోనే కొనసాగించామని తెలిపారు.
KTR Tweet On Jayashankar Jayanthi :తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషి అనిర్వచనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది వారి స్ఫూర్తి మరిచిపోలేనిదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పుట్టుక మీది చావు మీది బ్రతుకంతా తెలంగాణది జోహార్ జయశంకర్ సార్! జై తెలంగాణ అంటూ ట్వీట్ ఆయన ట్వీట్ చేశారు.