CM Revanth Reddy Comments on BRS Woman MLAs : 'బీఆర్ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తుంది. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసినా ఏం అనలేదు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. పార్టీని వదిలివెళ్లిన వారిలో ఒకరు మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి తెచ్చుకున్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారని' సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తన కుటుంబ సభ్యురాలు సీతక్క పట్ల ఎంత అవమానకరంగా మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. సీతక్కను అవమానించేలా సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడమేనా మీ నీతి అని ప్రశ్నించారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించవచ్చా అని అడిగారు. ఎవరి ఉచ్చులో పడి తప్పుదోవ పడుతున్న అక్కలను తాను చెబుతున్నది ఒక్కటే మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తిహాడ్ జైలులో ఉన్నారని గుర్తు చేశారు. వారిని అరెస్టు చేయవద్దని అవసరమైతే తమ చెల్లెలను ఏడాదిపాటు జైలులో ఉంచమని బేరసారాలు చేసుకున్నారని సీఎం విమర్శలు చేశారు.
"సబిత, సునీత కోసం కొట్లాడింది నేను. మహిళలను నేను గౌరవిస్తాను. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. జైళ్లో ఉన్న సొంత చెల్లి గురించి మాట్లాడరు. రైతు రుణమాఫీని దెబ్బ తీసి స్కిల్ వర్సిటీ ఆలోచనను అడ్డుకునేందుకు యత్నించారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తానని మోసం చేశారు. దళితునికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి బర్త్‌రఫ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ - ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ను చేశారు"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి