Zelensky On Russia Ukraine War : రష్యాతో రెండున్నరేళ్లకుపైగా సాగుతున్న యుద్ధాన్ని ముగించటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అధీనంలోని భూభాగానికి నాటో గ్యారంటీ ఇస్తే, రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెప్పారు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాలని జెలెన్‌స్కీ అన్నారు. అలా అయితే రష్యా ఆక్రమించిన భూభాగాన్ని దౌత్యమార్గాల ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంటుందని జెలెన్‌స్కీ తమ మనసులో మాట చెప్పారు. ఇప్పటివరకు నాటోలోని ఏ దేశమూ అలాంటి హామీ ఇవ్వలేదన్నారు. నాటోలో చేరాలనే ఉక్రెయిన్ ఆకాంక్షను ఏదైన సభ్యదేశం వ్యతిరేకించే అవకాశం ఉందని చెప్పారు. నాటో నిబంధన ప్రకారం పరస్పర రక్షణకోసం భవిష్యత్తులో ఏవైనా దాడులను తిప్పికొట్టడానికి సభ్యదేశాలు బలగాలను పంపాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరిలో రష్యా సైనికచర్య ప్రారంభించింది. తామిచ్చిన దీర్ఘ శ్రేణి క్షిపణులను మాస్కోపై దాడులకు అమెరికా అనుమతి ఇవ్వటంతో ఉక్రెయిన్‌పై రష్యా మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది.
రష్యా రక్షణ మంత్రితో కిమ్ భేటీ
మరోవైపు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌తో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యాతో రక్షణ, సైనిక సంబంధాలతో సహా అన్నిరంగాల్లో ఆ దేశంతో సంబంధాలు విస్తరించుకుంటామని కిమ్ పేర్కొన్నారు. అమెరికా దాని మిత్రదేశాలు కీవ్‌కు దీర్ఘశ్రేణి ఆయుధాలు అందించి రష్యాపై దాడి చేసేలా ప్రేరేపించాయని, అందుకు తప్పకుండా ప్రతీకార చర్యలు తీసుకోవాలన్నారు. మాస్కోకు తన ఆత్మరక్షణ నిమిత్తం ఎదురుదాడి చేసే హక్కు ఉందిని కిమ్ పేర్కొన్నారని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఉత్తరకొరియా రక్షణమంత్రి క్వాంగ్ చోల్‌తోనూ బెలౌసోవ్ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ఉన్న పలు ఒప్పందాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా బెలౌసోవ్ ప్రతినిధి బృందానికి ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన విందులో కిమ్ వ్యక్తిగతంగా హాజరయినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.