Security Measures In Banks : జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు, మోజుపడి కొనుక్కున్న బంగారం, ఇతర ఆభరణాలు బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంటాయని భావిస్తాం. అలాంటి బ్యాంకుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో దొంగల పడతారేమేనన్న భయానికి లాకర్లో బంగారం, నగదు బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటాం. కానీ ఈ మధ్య బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలను చూసి కస్టమర్లు బ్యాంకుల్లోనే బంగారాన్ని కొట్టేస్తే ఇంకెక్కడ దాచిపెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ఈ చోరీలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడీ : ఇటీవల వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఎస్‌బీఐ బ్యాంకులో దొంగతనం జరిగింది. దొంగలు రూ.15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు. బ్యాంకులో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో దొంగతనం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నగరంలోని బ్యాంకుల దగ్గర భద్రతా లోపాలను బయటపెడుతోంది.
రాత్రిపూట కనిపించని రక్షణ చర్యలు : బ్యాంకులు మూసేసిన తర్వాత వెలుపల సెక్యూరిటీ గార్డులు కనిపించడం లేదు. కొన్ని చోట్ల రాత్రి 10 దాటినా భద్రతా సిబ్బంది రావట్లేదు. నిర్మానుష్య ప్రాంతాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాంకు శాఖల దగ్గర భద్రతా ఏర్పాట్లు కనిపించట్లేదు. ఏటీఎంల దగ్గర ఎక్కడా రక్షణ చర్యలు లేవు. సెక్యూరిటీ సిబ్బంది లేరు. కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలు కూర్చొని ఉంటున్నారు. కొన్నిచోట్ల సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతూ కనిపిస్తుంటారు.
ఆర్‌బీఐ నిబంధనలివీ :
- బ్యాంకు శాఖ ప్రారంభించాలంటే ఆ భవనంలో స్ట్రాంగు రూము నిర్మించాలి. అది పూర్తిగా ఇంజినీర్ పర్యవేక్షణలోనే నిర్మాణం జరగాలి. భవనం ప్రధాన ద్వారం ఒకటే ఉండేలా బ్యాంక్ నిర్మాణం చేపట్టాలి.
- ఉదయం బ్యాంకు షట్టర్ తెరచిన తర్వాత లాక్ చేసేలా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయాలి. బ్యాంకు పరిసరాలలో, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- బ్యాంకులు మూసివేసిన తర్వాత అలారం ‘నైట్ మోడ్’ ఉందో లేదో చూసుకోవాలి. అలారం ఆధునిక పద్ధతిలో అమర్చితే దొంగలకు కనిపించకుండా ఉంటుంది. లేదంటే ధ్వంసం చేస్తారు.
- స్ట్రాంగ్ రూంలో ఎవరైనా దాగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకు మూసివేస్తున్నప్పుడు నిశితంగా పరిశీలించాలి. లాకర్స్ తాళాలను సరి చూడాలి.
- రాత్రివేళ పట్టణాలకు బయట ఉన్న బ్యాంకు శాఖల చుట్టూ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలి.
- పురాతన భవనాల్లో ఉన్న బ్యాంకు భవనాల పునర్నిర్మాణం విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
- బ్యాంకులు, ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి.
బ్యాంక్ లాకర్లో బంగారం దాచిపెడుతున్నారా? అయితే ఆర్బీఐ రూల్స్ ఇవే
బ్యాంక్ లాకర్లో ఏం దాయవచ్చు? ఏం దాయకూడదు? - పూర్తి లిస్ట్ ఇదే!