3-2-1 Sleep Rule: ప్రస్తుత పని ఒత్తిడి వల్ల మనలో చాలా మందికి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. హాయిగా నిద్రపోవడానికి ఫోన్ పక్కనపెట్టినా ప్రయోజనం లేదని అంటుంటారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా సోషల్ మీడియాలో 3- 2- 1 స్లీప్ రూల్ ట్రెండింగ్ అవుతోంది. 2020లో Journal of Sleep Research ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ పద్ధతి వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడి సుఖంగా నిద్రపోతారని తేలింది. "The 3-2-1 sleep rule: A pilot study" పేరిట జరిగిన అధ్యయనంలో Harvard Medical School శాస్త్రవేత్త Jennifer Smith పాల్గొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
3 గంటల ముందు అవి తీసుకోకూడదు
ఈ రూల్‌లో భాగంగా మొటగా నిద్రకు మూడు గంటల ముందు సోడా, కూల్‌డ్రింక్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నింటిల్లో కొద్ది పరిమాణంలో ఉండే ఆల్కహాల్, రసాయనాలు నిద్రకు భంగం కలిగిస్తాయని వివరించారు. నిజానికి కెఫీన్ ఉండే టీ, కాఫీలకూ ఈ సూత్రం వర్తిస్తుందని అంటున్నారు. అందుకే పడుకోవడానికి ముందు వీటిని దూరంగా ఉంచితే నిద్ర మంచిదని తెలిపారు. ఫలితంగా నిద్ర పట్టకపోవడం, పదే పదే మెలకువ రావడం వంటివి తగ్గి.. గాఢనిద్ర అలవాటు అవుతుందని పేర్కొన్నారు.
2 గంటల ముందే తినాలి
మనలో చాలా మందికి తినగానే పడుకునే అలవాటు ఉంటుంది. అయితే, ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినగానే పడుకోవడం వల్ల శరీరంలో యాసిడ్లు, చక్కెర స్థాయులు పెరిగి.. మెలకువగా ఉండేలా చేస్తాయని వివరించారు. అందుకే ఆహారం జీర్ణమయ్యే సమయం ఇవ్వాలని.. కనీసం 2గంటల ముందే భోజనం ముగించాలని చెబుతున్నారు. అప్పుడే శరీరం విశ్రాంతి పొందినట్లుగా భావించి.. నిద్రపోయేలా చేస్తుందని వివరించారు.
గంట ముందే తాగాలి
నిద్రపోయాక మధ్యలో దాహం వేస్తుందేమో అని చాలామంది ముందు మంచినీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకోవడానికి కనీసం గంట ముందే నీరు తాగాలని సూచిస్తున్నారు. ఒకవేళ పడుకునే ముందు నీరు తాగితే మధ్యలో మూత్రానికి లేవాల్సి వస్తుందని అంటున్నారు. ఇలా ఒకసారి లేచాక నిద్ర పట్టమన్నా చాలాసార్లు పట్టదు. ఫలితంగా ఉదయాన్నే అలసట వస్తుందని వివరించారు.
ఈ 3-2-1 రూల్‌తో పాటు మంచం, కప్పుకొనే దుప్పటి, దిండు వంటివీ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఆరోగ్యకరమైన, నాణ్యమైన నిద్ర సాధ్యమని చెబుతున్నారు. ఇంకా జీర్ణప్రక్రియ సాఫీగా సాగడం, మధ్యలో లేచే అవకాశాలు తక్కువ, గాఢనిద్ర అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రి సరిగ్గా నిద్ర పట్టట్లేదా? ఈ చిన్న పని చేస్తే హాయిగా నిద్రపోతారట! మీరు ట్రై చేయండి
మధ్యాహ్నం నిద్రపోతే మొటిమలు రావట! పగటి పూట కునుకుతో ఎన్నో లాభాలు!