Hydra Visit in Jagadgirigutta : హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను త్వరలో కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
"వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ చూశాము. ఇక్కడ కబ్జాలు జరిగాయని స్థానికులతో పాటు అన్నీ పార్టీల నాయకులు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. కొంతమంది పేదవాళ్లకి అని చెప్పి ఇళ్లు నిర్మించి వాటిని అమ్మి లాభ పడుతున్నారు. బుధవారం మీటింగ్ పెడతాము. పూర్తి వివరాలు సేకరించి, ఇక్కడ ఉన్న గుండాన్ని యథాస్థితికి తీసుకువస్తాం. నోటీసులు ఇచ్చి కూల్చివేతలు ప్రారంభిస్తాం" -రంగనాథ్, హైడ్రా కమిషనర్
వైరల్‌గా మారిన వీడియో : ఆలయ భూములు కబ్జాకు గురైయ్యాయని, గుడిని కాపాడాలని ఆలయ పూజారి సోషల్ మీడియా ద్వారా విలపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. జగద్గిరిగుట్ట డివిజన్లోని సర్వే నంబరు 348/1 లో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయ భూమి సుమారు 25 ఎకరాలు కబ్జాకు గురవుతోందని అందులో ఆరోపించారు. దీనిని చూసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి ఇవాళ గుడిని సందర్శించారు.
వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన కొనేరు పరిధిలోని భూములను కబ్జా చేస్తూ గుడి పేరుతో రూములు కట్టి విక్రయిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెరువును ఆనుకుని ఉన్న భూదేవి హిల్స్, బాలకృష్ణ నగర్ కాలనీలను రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆలయం, పరికి చెరువును సందర్శించారు.
రంగనాథ్ సీరియస్ : ఏకంగా 25 ఎకరాల దేవాలయ భూమి కబ్జాకు గురి అవుతోందని తన దృష్టికి రావడంతో అధికారులపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. స్థానికంగా ఉన్న పలువురు నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందంటూ, వీరిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. స్థానికంగా కబ్జాకు పాల్పడిన కొందరిపై నేరుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. కుల సంఘాల పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలో వెనకడుగు లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఫిర్యాదులకు మూడు వారాల్లో పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్