New Income Tax Bill : కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానుట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండో విడత సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ, నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఈ కొత్త చట్టాన్ని తీసుకురానుట్లుగా సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 'పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి బిల్లును ప్రవేశపెడతాం. ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ కాదు. పూర్తిగా కొత్త చట్టం. ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. బడ్జెట్ రెండో విడత సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది' అని సంబంధిత అధికారులు తెలిపారు.
రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఆదాయపు పన్ను బిల్లు చర్చకు రానుంది.
ఆదాయపు పన్ను చట్టం-1961 అనేది ఆరు దశాబ్దాల క్రితం . ఈ చట్టంలో ప్రత్యక్ష, కార్పొరేట్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్నులు, గిఫ్ట్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఇలా అన్నీ కలిపి 298 సెక్షన్లు, 23 అధ్యాయాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకొనేలా మార్చాలని కేంద్రం భావిస్తోంది. అందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) అంతర్గతంగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాలు, సలహాలను ఆహ్వానించింది. అలా ఆదాయపు పన్ను శాఖకు మొత్తం 6,500 సూచనలు అందాయి. వీటిని పరిగణలోకి తీసుకుని కొత్త బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. పరిమాణ పరంగా 60 శాతం తక్కువ పేజీల్లో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారని సమాచారం. దీంతో పన్ను చెల్లింపుదారులు ఎటువంటి కష్టం లేకుండా సులువుగా నిబంధనల్ని అర్థం చేసుకొనేందుకు వీలుకానుంది.