CM Revanth Reddy Responds on Eenadu Story : ఈనాడు-ఈటీవీలో ప్రచురితమైన మరో కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కండరాల క్షీణత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్న ఇంటర్ విద్యార్థి రాకేశ్‌పై ఈనాడులో ప్రచురితమైన 'నాకూ బతకాలని ఉందమ్మా' కథనానికి సీఎం చలించారు. రాకేశ్‌కు ఉచిత వైద్యంతో పాటు ఛార్జింగ్ వాహనం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాకేశ్ కుటుంబసభ్యులతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తరఫున హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి రాకేశ్ తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. రాకేశ్ ఇంటికి వెళ్లి ఛార్జింగ్ వాహనం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూడో మస్క్యులర్ డిస్ట్రొఫితో బాధపడుతున్న రాకేశ్ : హనుమకొండ జిల్లా ములకనూరులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాకేశ్ సూడో మస్కులర్ డిస్ట్రొఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. తండ్రి సమ్మయ్య లారీ డ్రైవర్. సంపాదన అంతంత మాత్రమే. తలుపులు కూడా లేని చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు. రాకేశ్ నాలుగు సంవత్సరాల వయసులో తరచూ కిందపడిపోతుండటంతో తల్లిదండ్రులు పలువురు డాక్టర్లకు చూపించారు. 'సూడో మస్క్యులర్ డిస్ట్రొఫి' అనే కండరాల క్షీణత వ్యాధి బారిన పడినట్టు డాక్టర్లు చెప్పడంతో రూ.8 లక్షల వరకు ఖర్చు చేసి అనేక ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. దీంతో మరింత పేదరికంలోకి వెళ్లిపోయారు. మొదట్లో రాకేశ్ కాళ్లు మాత్రమే తడబడుతుండగా తరువాత చేతులు, కాళ్లు పట్టు కోల్పోవడంతో కర్ర సాయంతోనూ నడవలేని స్థితికి వచ్చాడు. అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా 3 చక్రాల సైకిల్‌పై తల్లి సాయంతో పాఠశాలకు వెళ్లాడు. వంగర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణత సాధించాడు.
ప్రస్తుతం ములుకనూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలి కాలంలో కుమారుడు మరింత బలహీనంగా మారుతుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లను సంప్రదించారు. ఒక్కోటి సుమారు రూ.32 వేల ఖరీదైన సూదిమందును 5 నెలల పాటు క్రమం తప్పకుండా వాడితే వ్యాధి నయం అవుతుందని, లేనిపక్షంలో మరో మూణ్నాలుగేళ్లలో చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. రాకేశ్ కుటుంబ పరిస్థితిపై ఈనాడులో కథనం వచ్చింది.