Kisan Reddy Comments On State President : జనవరి నెలాఖరుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని, కొత్త అధ్యక్షుడు పేరు ఖరారవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ వ్యక్తే ఉండాలనే నియమం ఏం లేదన్నారు. నామినేటెడ్ ప్రక్రియ ద్వారానే కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇప్పుడు నియమించిన వ్యక్తే అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్లడించారు.
అప్పటి వరకు ఆందోళనలు చేయం : స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం సీట్లకు పోటీ చేస్తామని, ఈసారి మెజారిటీ సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. స్థానిక పోరులో బీజేపీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీగా ఆయన అభివర్ణించారు. సంస్థాగత ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఆందోళనలు, పోరాటాలు చేయకూడదని జాతీయ నాయకత్వం ఆదేశాలు ఉన్నాయని, అందుకే అలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు.
ఉచితాలు వద్దని మేమెప్పుడు చెప్పలేదు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఇప్పటికే 610 మండలాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేశామని, మండలాల్లో మహిళా అధ్యక్షులను కూడా నియమించినట్లు తెలిపారు. 50శాతం బీసీలను మండలాలకు అధ్యక్షులుగా నియమించామని, 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తున్నామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినంత మాత్రాన దిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ఉచితాలు వద్దని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని, రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీకి నిధులను కేటాయించినట్లు తెలిపారు.
200 ఎకరాలు ఇస్తే సరి : చిరంజీవి సినీ పరిశ్రమలో మెగాస్టార్. అందుకే తాను ఇటీవల సంక్రాంతి వేడుకలకు రావాలని ఆహ్వానం పలికినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తాము అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం 200 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు.
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బు, సమయం ఆదా అవుతుందని అన్నారు. ప్రతి ఏడాది ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి నిలిచిపోతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేశారని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీలో 7 నెలల నుంచి వీధిలైట్ల కొరత తీవ్రంగా ఉందని, ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని ధ్వజమెత్తారు.
స్థానిక ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నిధులు : గ్రామాల్లో సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే జీతాలు సైతం ఇవ్వలేకపోతుందని ఆరోపించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఎలా ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలనే నిబంధన ఉందని, 76,77 రాజ్యాంగ సవరణలోనే ఈ నిబంధన ఉందన్నారు.
హైడ్రా కొత్తదేం కాదు : ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వెతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీర్లు కొనుగోలు చేసిన డబ్బు కూడా డైవర్ట్ చేశారని, ఇప్పుడు ఆ కంపెనీ వారు బీర్లు సరఫరా చేయమని చెబుతున్నారన్నారు. హైడ్రా అనేది కొత్త సంస్థ కాదని, గతంలో కూడా చెరువులు కబ్జా చేస్తే అనుమతి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు హైడ్రా అదే చేస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తే రైల్ రింగ్ సర్వే చేసే అవకాశం ఉంటుందన్నారు. మూసీ సుందరీకరణ చేయాల్సిందే అని, పేదల ఇళ్లు కూల్చకుండా చేయాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు - కాంగ్రెస్ మరోసారి నవ్వులపాలైంది : కిషన్ రెడ్డి