Kangana Ranaut Emergency : బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' ఎట్టకేలకు శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు ఆమె స్వయంగా దర్శకత్వం వహించింది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత కంగన నటించిన సినిమా రిలీజ్ అవుతుండడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆమె అరుదైన ఘనత అందుకుంది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో కంగన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించారు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. తొలి రోజు 'ఎమర్జెన్సీ' రూ.2.35 కోట్లు వసూలు చేసింది. అయితే కొవిడ్ తర్వాత కంగనా రనౌత్‌కు ఇదే అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. ఇక వీకెండ్ రావడం వల్ల ఈ రెండు రోజుల్లో పొలిటికల్ డ్రామా వసూళ్లు సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
గత సినిమాల ఓపెనింగ్స్
2023లో వచ్చిన కంగనా రనౌత్ మూవీ 'తేజస్' ఓపెనింగ్ రోజు రూ.1.25 కోట్లు వసూల్ చేసింది. అలానే 2022లో ఆమె నటించిన 'ధాకడ్' మూవీ ఫస్ట్ డే రూ.1.2 కోట్లకు పరిమితం అయ్యింది. ఇక 2021లో రిలీజైన పొలిటికల్ డ్రామా 'తలైవి' మొదటి రోజు రూ.1.46 కోట్లు సంపాదించింది. ఈ చిత్రంలో కంగన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించారు. అయితే కరోనాకి ముందు, కంగనా నటించిన 'పంగా (2020)' ఏకంగా రూ.2.70 కోట్ల ఓపెనింగ్ సాధించింది.
కాగా, ఈ సినిమా విషయానికొస్తే, దీనికి కంగన నిర్మాతగానూ వ్యవహరించారు. చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించారు. వారితోపాటు మిలింద్ సొమన్, భూమికా చావ్లా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందింది.