Padmavathi Brahmotsavam simha Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేది శనివారం సాయంత్రం జరుగనున్న సింహ వాహన సేవ విశిష్టతను తెలుసుకుందాం.
సింహ వాహనంపై శ్రీ పద్మావతి
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పట్టమహిషి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 30వ తేది శనివారం సాయంత్రం అమ్మవారు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
సింహ వాహనంపై యోగ లక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి సింహ వాహనంపై యోగ లక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
సింహ వాహన సేవ విశిష్టత
సింహం పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, వాహన శక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ అంటే సిరి, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ
దుష్టజన శిక్షణకు, శిష్ట జన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహా ధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో సమస్త శక్తులు చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడం కోసం, ఇంకా మితిమీరిన అహంకారంతో, అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడమే ఈ అవతార ప్రయోజనమని తన భక్తులకు తెలిపేందుకే బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు.
సింహ వాహనంపై అధిరోహించిన అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా ఐశ్వర్యం, యశస్సు, జ్ఞానం, ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సింహ వాహనంపై ఊరేగే శ్రీ పద్మావతి అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.