LOVE FAILURE REASONS : "అది ప్రేమనా? ఆకర్షణా??" కొత్తగా ప్రేమలో పడిన వారిలో చాలా మందికి ఈ విషయంలో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేకుండానే "పడ్డామండీ ప్రేమలో మరీ" అంటూ ఫస్ట్ సాంగ్ ఆన్ చేస్తారు. "నువ్వక్కడుండీ నేనిక్కడుంటే ప్రాణం విలవిలా" అంటూ ఉద్వేగాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత చాలా జరుగుతాయి. ఏడాది తిరగకుండానే లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిపోతుంది. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఒకదాని తర్వాత మరొకటి ప్లే అవుతూనే ఉంటాయి! మరి, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఆర్య సినిమాలో సుకుమార్ ఓ మాట అనిపిస్తాడు. "ఈ ఫిబ్రవరి 14న కలిసిన జంటల్లో ఎన్ని జంటలు నెక్స్ట్ లవర్స్ డేకి ఇలాగే కలిసి ఉంటున్నాయి?"అని! నిజమే, రకరకాల కారణాలతో ఎన్నో జంటలు విడిపోతూ ఉంటాయి. ఏడాది కూడా తిరగకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉంటారు. మీకు ఆ పరిస్థితి రాకూడదంటే కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ జాన్ గోట్‌మాన్. బంధాలు, వివాహాల గురించి ఎన్నో పరిశోధనలు చేసిన గోట్‌మాన్, "The 7 Principles for Making Marriage Work" వంటి ఎన్నో ప్రసిద్ధ పుస్తకాలను రచించారు. ప్రేమలో ఎక్కడ సమస్యలు వస్తాయో, వాటి నుంచి బంధాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయన క్లియర్‌గా వివరించారు.
నీకేం తెలుసు? :
మీ పార్ట్నర్ గురించి మీకు ఎంత తెలుసు? ఇది గోట్ మాన్ వేసే మొదటి ప్రశ్న. వారి ఇష్టాలు, అయిష్టాలు, కలలు, భయాలు వంటివన్నీ మీకు తెలిసి ఉండాలంటారు. ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు తెలుస్తుందని, తద్వారా మీ లవ్ జర్నీ సాఫీగా సాగిపోతుందని, మీ అనుబంధం మరింత పెరుగుతుందని సూచిస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్ చేయండి :
చాలా మంది తమ భాగస్వామి పట్ల ఎంత ప్రేమ ఉందో చెబుతుంటారు. అది నిజం కూడా కావొచ్చు. కానీ, ఆ ప్రేమను వ్యక్తపరచరు! ప్రేమ అంటే మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, చేతల్లో కూడా చూపించాలి. అప్పుడే కదా మీ పార్ట్నర్ను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి అర్థమయ్యేది అంటారు గోట్ మాన్.
అటెన్షన్ ఇవ్వండి :
ప్రేమలో అతి ముఖ్యమైన అంశం టైమ్ ఇవ్వడం. కేవలం ప్రేమిస్తున్నా అంటే సరిపోదు. వారికి తగిన టైమ్ ఇచ్చి, వారితో గడపాలి. వాళ్లు ఏదైనా చెబుతున్నప్పుడు, మీరు ఏదో పనిలో ఉండి వింటున్నట్టుగా ఉండకూడదు. వారు మీ సహాయం కోసం, లేదా కనెక్షన్ కోసం ప్రయత్నించినప్పుడు వారి వైపు తిరగండి. వారి కళ్లలోకి చూస్తూ చెప్పేది శ్రద్ధగా వినండి. అప్పుడు మీరు వాళ్లను చాలా పట్టించుకుంటున్నారనే భావన కలుగుతుంది.
ప్రశంసించండి :
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి మనిషీ దీన్ని కోరుకుంటాడు. అయితే బయటి వాళ్లకన్నా, తమను ప్రేమించే వారి నుంచి నిజాయితీగా వచ్చే ప్రశంసం వారిని ఎవరెస్టు మీద కూర్చోబెడుతుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే, అది ఫేక్ ప్రశంస కాకూడదు. వాళ్లు చేసే పనిలో ఏదైనా తేడా ఉంటే మృదువుగా సూచిస్తూనే, వారిలోని బెటర్ క్వాలిటీస్‌ను నిజాయితీగా అభినందించండి. ఇది వారికి ఎంతగానో నచ్చుతుంది.
ఘర్షణలో ఇలా:
సంఘర్షణ లేని బంధం ఉండదు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు అత్యంత సహజం. అయితే, వాటిని ఎలా డీల్ చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీ పార్ట్నర్ పనులు మీకు నచ్చకపోతే ఎక్కడ సమస్య ఉందో శాంతంగా వివరించండి. మీ అభిప్రాయాలను గౌరవంగా వ్యక్తపరచండి. కోపంలో నోరు జారకుండా చూసుకోండి. మాట పెదవి దాటితో మళ్లీ వెనక్కి తీసుకోలేం. మనసును అది ఎంతో గాయపరుస్తుంది.
కలలను నిజం చేయండి :
ప్రతి ఒక్కరికీ సొంత కల ఉంటుంది. వాటిని మీ పార్ట్నర్ సాకారం చేసుకునేందుకు మీ వంతు తప్పకుండా ప్రయత్నించండి. నిజాయితీగా ప్రోత్సహించండి. ఇలా చేస్తే మీ భాగస్వామి మనసులో మీపై ప్రేమ పెరగడం మాత్రమే కాదు, గౌరవం కూడా పెరుగుతుంది.
భవిష్యత్తు గురించి :
ఫ్యూచర్ గురించి మీ ఇద్దరికీ వేర్వేరు ఆలోచనలు, నమ్మకాలు, లక్ష్యాలు ఉంటాయి. అవి షేర్ చేసుకోండి. ఇద్దరి ఒపీనియన్స్ ముందు పెట్టి, అందులో నుంచి ఒక ఫైనల్ రూట్ మ్యాప్ ఫిక్స్ చేసుకోండి. దీనివల్ల మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. ఇద్దరూ కలిసి హ్యాపీగా లక్ష్యంవైపు సాగిపోతారు.
ఇవి చేయకండి :
- ఎంత పెద్ద తప్పు చేసినా సరే, భాగస్వామి వ్యక్తిత్వాన్ని తప్పు పట్టకూడదు. ఆత్మగౌరవాన్ని నిందించడం మొదలు పెడితే ఆ బంధం కుప్పకూలిపోవడం ఖాయం. దీనికి బదులుగా చేసిన పనిమీద మాట్లాడండి. దానివల్ల కలిగిన నష్టం గురించి మాట్లాడండి. అంతే తప్ప క్యారెక్టర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాదించొద్దు.
- భాగస్వామిని ఎప్పుడూ తక్కువగా చూడకండి. అవమానించడం, ఎగతాళి చేయడం వంటివి అస్సలే చేయకండి. ఇది పార్ట్నర్లో అభద్రతను పెంచుతుంది. మీ వద్ద సెక్యూరిటీ లేనట్టుగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామికి ఈ ఆలోచన వస్తే ఆ ప్రేమ చనిపోవడం మొదలవుతుంది.
- మీ నుంచి తప్పు జరిగితే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయకండి. దీనివల్ల మీపైన ఉన్న గౌరవం తగ్గిపోతుంది. పొరపాటు జరిగితే నిజాయితీగా అంగీకరించండి. మళ్లీ జరగకుండా చూస్తానని హామీ ఇవ్వండి.
- ప్రతి విషయాన్నీ మీ కోణంలో నుంచే చూడకండి. వారి స్థానంలో ఉండి ఆలోచించండి. భాగస్వామి ఏ పనిచేసినా అందులో తప్పులు వెతకడం ఆపండి. అది ప్రేమను తగ్గిస్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
- ఒక విషయం మీద మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మీ భాగస్వామికి మరొకటి ఉంది. ఈ విషయం ఇద్దరికీ తెలియాలంటే.. మీ భావాలను బయట పెట్టడమే మార్గం. అభిప్రాయాలు షేర్ చేసుకోండి. తేడా ఎక్కడ ఉందో క్లియర్ చేసుకోండి. అంతేగానీ, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడితే క్రమంగా మీ బంధం బీటలు వారుతుంది.
- ప్రేమలో మొదటి మెట్టు, చివరి మెట్టు "నమ్మకం". ఒకరిమీద మరొకరికి నమ్మకం లేకపోతే ఆ బంధం నిలబడదు. భయం, అభద్రతా భావం అన్నీ చుట్టుముడతాయి. చివరకు విడిపోయే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా ఒకరినొకరు నమ్మండి. నిజాయితీగా ఉండండి.
ఇవి కూడా చదవండి :
ప్రేమికుల దినోత్సవం 2025 - అద్దిరిపోయే విషెస్ & ప్రత్యేక శుభాకాంక్షలు మీకోసం!
బ్రేకప్ అయిన వాళ్లకూ "వాలెంటైన్స్ డే" - ఇలా సెలబ్రేట్ చేసుకోండి!