Benefits OF Fire Insurance : వేసవి కాలంలో తరచుగా ఏదో ఓ చోట అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు, గ్యాస్ సిలిండర్ పేలి కాలి బూడిదైన సామాగ్రి ఇలా తరచూ వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. కారణం ఏదైనప్పటికీ వేసవికాలం వచ్చిదంటే చాలు అగ్ని కీలలతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తుంటుంది. విలువైన ఆస్తులతోపాటు కలలూ కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని ప్రమాదం వాటిల్లినా, ఆర్థికంగా భారం పడకుండా ఉండాలంటే ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. ఈ విషయంలో చాలామందికి కొన్ని సందేహాలు, అపోహలు ఉంటుంటాయి. వాటితో అందులో ఉన్న వాస్తవాలేంటో తెలుసుకుందాం.
వ్యాపార సంస్థలకు ఫైర్ ప్రమాదాల వల్ల నష్టం జరిగితే పరిహారం ఇచ్చేదే ఫైర్ ఇన్సూరెన్స్. మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం వల్ల ఆస్తులు, వస్తువులకు జరిగిన నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఈ పాలసీ తీసుకునే ముందే ఎంత విలువైన పాలసీని తీసుకుంటారో అంత మేరకు పరిహారం లభిస్తుంది.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే : వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి వ్యాపార సంస్థా అగ్ని ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలనూ తీసుకోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగినా అది వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని పరికరాలనూ ఏర్పాటు చేయాలి. సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై శిక్షణ ఇవ్వాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ చిన్న నిప్పు రవ్వతో అగ్ని కీలలు చెలరేగిన సందర్భాలు అనేకం. అగ్ని ప్రమాద బీమా ప్రాధాన్యం ఎంత ఉందో ఈ ఒక్క ఉదాహరణను బట్టి అర్థం చేసుకోవచ్చు.
అగ్ని ప్రమాదాలు చెలరేగడానికి ప్రాథమికంగా ఎలక్ట్రిక్ వైర్లే కారణం అవుతుంటాయి. ప్రతి వ్యాపార సంస్థలోనూ, దుకాణంలో ఇవి సర్వ సాధారణం. కాబట్టి, వ్యాపార సంస్థ పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఫైర్ బీమా తీసుకోవడం మంచిది. ఫ్యాక్టరీ యజమానులకు సరకు అంతా కాలిపోతే వ్యాపారం నడవడమనేది కష్టంతో కూడుకున్న పని. కొన్నిసార్లు ప్రమాదంలో కార్మికులు కూడా మరణించొచ్చు. ఇలాంటి సందర్బాల్లో వారి కుటుంబానికి పరిహారాన్నీ ఈ బీమా అందిస్తుంది. వ్యాపారాన్ని బట్టి, అగ్ని ప్రమాద బీమాను(ఫైర్ ఇన్సూరెన్స్‌ను) తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఫైర్ ఇన్సూరెన్స్ లేకపోతే మరమ్మతు ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వస్తుంది. వ్యాపార సంస్థ దగ్గర తగినంత నిర్వహణ మూలధనం లేకపోతే వ్యాపారాన్ని కొనసాగించడానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావచ్చు.
ప్రీమియం భారం కాదు : చాలామంది వ్యాపార సంస్థల ఓనర్లు అగ్ని ప్రమాద బీమా కోసం చెల్లించే ప్రీమియం చాలా అధిక మొత్తంలో ఉంటుందని భావిస్తుంటారు. ప్రీమియం తగ్గించుకునే లక్ష్యంతో వారి ఆస్తుల విలువ తక్కువ ఉన్నట్లు నమోదు చేస్తుంటారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. అనుకోకుండా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు వాటిల్లిన నష్టానికి పూర్తి పరిహారం అందదు. అలాంటప్పుడు పాలసీ ఉన్నప్పటికీ దానివల్ల వచ్చే ప్రయోజనం అంతంత మాత్రమే. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ ఆస్తి విలువకు సరిసమానంగా పాలసీ ఉండేలా చూసుకోండి. తక్కువ పాలసీని కొనుగోలు చేయడం వల్ల అది ఉన్నా లేనట్లే అవుతుంది.
ఈ విషయాలన్నీ చూశాకే :
- అగ్ని ప్రమాద బీమా పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని కాలనుగుణంగా సమీక్షించుతూ ఉండండి. వ్యాపార పరిమాణం పెరగడం, ఆస్తుల విలువ అధికం కావడంలాంటి వాటి ఆధారంగా, దానికి తగినట్లుగా బీమా ఉందా లేదా లేదా అనే విషయాలు చూసుకోండి.
- పాలసీ పత్రంలో చిరునామా సరిగా ఉందా లేదా సరిచూసుకోండి. ఒకే ప్రదేశంలో పలు రకాల వస్తువులు, ఆస్తులు ఉన్నప్పుడు వాటన్నింటికీ కలిపి ఒకే బీమా పాలసీ ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ప్రతిదానికీ విడివిడిగా తీసుకోవడం కంటే అన్నింటికీ కలిపి ఒకే పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గే అవకాశముంది.
- ఫైర్ ప్రమాదం జరిగినప్పుడు దాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశాలపై ఒక నివారణ ప్రణాళికలను అందుబాటులో ఉంచుకోవాలి.
- మీ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులందరికీ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలి. తగిన శిక్షణను ఇప్పించాలి.
- ప్రమాద నివారణ పరికరాలతో సహా ప్రమాదం జరిగినప్పుడు అప్రమత్తం చేసే అలారం తదితరాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ప్రీమియంలో కొంత రాయితీ కూడా లభిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా ఉందా? సింపుల్ టిప్స్‌తో ఈజీగా తగ్గించుకోండిలా!
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ టాప్-3 'యాడ్ ఆన్స్'తో మీ కుటుంబానికి పూర్తి భరోసా!