Tilts One Side Building Demolition in Gachibowli :హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. సిద్ధిఖ్‌నగర్‌లో మంగళవారం రాత్రి ఉన్నట్లుండి ఒక్కసారిగా ఓ భవనం పక్కకు ఒరిగింది. దాంతో అందులో నివసించే 50 మందికి పైగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ, పోలీసులు, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసరాల్లో స్థానికులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. బుధవారం హైడ్రాలిక్ యంత్రం సహాయంతో కూల్చివేత ప్రక్రియను పూర్తి చేశారు. అయితే పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరో భవన నిర్మాణానికి భారీ గుంతలు తవ్వడ వల్లనే తమ భవనం పక్కకు ఒరగడానికి కారణమని ఇంటి యజమాని స్వప్న తెలిపారు.
ఈ నేపథ్యంలో సిద్ధిఖీనగర్‌లో సామర్ధ్యానికి మించి అనేక భవనాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో లోతుగా తవ్విన గుంతలను పూడ్చివేశారు. అలాగే భవనం ఒరగడానికి కారణమైన పక్క స్థలం యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భవనాన్ని కూల్చడంతో ఇంట్లో సామాన్లు పోయాయని ఇంటి యజమానురాలు లబోదిబోమని ఏడ్చింది. ఇంట్లో నివసించేవారు సర్టిఫికేట్లు, విలువైన వస్తువులను పోగొట్టుకున్నారు.