BRS Party Focus On Coordinators : శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha polls 2024) సవాల్‌గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ అభ్యర్థులు (BRS Candidates), ఇంకా దాన్నుంచి పూర్తిగా తేరుకోలేదు. స్థానికంగా నేతల మధ్య మనస్పర్థలు, వివాదాలు పూర్తిగా సమసిపోలేదు. ఓటమి పాలైన ఇన్‌ఛార్జ్‌లకే పూర్తి బాధ్యతలు అప్పగించడం సరికాదన్న భావన కొన్ని చోట్ల శ్రేణుల్లో నెలకొంది. పై అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పార్టీలోని అందరినీ కలుపుకొని పోయే విషయమై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది.
BRS Party Appoints coordinators :నేతలు, శ్రేణులు అందరిని విశ్వాసంలోకి తీసుకొని ముందుకెళ్లే ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల కోసం సమన్వయకర్తలను (coordinators) నియమిస్తోంది. శాసన మండలి సభ్యులు, సీనియర్ నేతలు, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. శాసనసభ నియోజకవర్గాల (Assembly Constituency) వారీగా ఈ సమన్వయకర్తలను నియమిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర సీనియర్ నేతలు, శ్రేణులను సమన్వయం చేయడం వీరి బాధ్యత. ఇప్పటి వరకు మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించారు.
చేవెళ్ల నియోజక వర్గం సమన్వయకర్తగా స్వామిగౌడ్ : చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలోని (Lok Sabha Constituency) మహేశ్వరం సమన్వయకర్తగా మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, రాజేంద్రనగర్‌కు సీనియర్ నేత పుట్టం పురుషోత్తం రావును సమన్వయకర్తలుగా నియమించారు. శేరిలింగంపల్లి సమన్వయకర్తగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్, చేవెళ్లకు పార్టీ కార్యదర్శి నాగేందర్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. పరిగికి సీనియర్ నేత గట్టు రామచంద్రరావు, వికారాబాద్ కు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, తాండూర్‌కు జెడ్పీ వైస్ ఛైర్మన్‌ను బైండ్ల విజయ్ కుమార్‌ను సమన్వయకర్తగా నియమించారు.
మల్కాజిగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే :మల్కాజిగిరి నియోజకవర్గంలోని మేడ్చల్ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజును, మల్కాజిగిరికి కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. కుత్బుల్లాపూర్‌కు సీనియర్ నేత గొట్టిముక్కుల వెంగళరావు, కూకట్ పల్లికి మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్‌కు పార్టీ కార్యదర్శి జహంగీర్ పాషను సమన్వయకర్తలుగా నియమించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తకు బాధ్యతలు ఇచ్చారు.