Ways To Attract Money At Home : ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మనిషి జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. ఎంత సంపాదించినా రూపాయి కూడా నిలవడం లేదని కొంతమంది అంటుంటారు. నిజానికి కొంతమంది ఎలాంటి దుబారా ఖర్చులు చేయకపోయినా కూడా వారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోడానికి కారణాలేమిటి? ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
గృహమే కదా స్వర్గసీమ!
నిజమే! సానుకూల పవనాలు ఉన్న ఇల్లు నిజంగా స్వర్గమే! లక్ష్మీ నిలయమే! ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు, కలహాలతో నిండి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ నిలవదు. అలాగే పరిశుభ్రంగా లేని ఇంట కూడా లక్ష్మీదేవి నివసించదు. ఇవన్నీ సరి చేసుకోకుండా డబ్బు రావడం లేదని తరచుగా అంటూ ఉండడం సరైనది కాదు. ముందు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి. కుటుంబంలో సమస్యలు ఉంటే, గొడవలు పడకుండా సహనంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి.
అన్యోన్య దాంపత్యం
ఏ ఇంట్లో అయితే భార్య భర్తలు అనోన్యంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ జీవిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి వద్దన్నా వస్తూనే ఉంటుంది. పెద్దలను గౌరవించే ఇంట కూడా సిరి తాండవమాడుతుంది. పిల్లలను అస్తమానం కొడుతూ తిడుతూ ఉండే ఇంట అసలు లక్ష్మీదేవి ఉండదు. మా ఇంట్లో ఇలాంటి గొడవలేమి లేవండి! అయినా కానీ ఆర్థిక సమస్యలు ఉన్నాయంటారా! అయితే కొన్ని సింపుల్ పరిహారాలు మీ కోసం!
- రోజూ సూర్యోదయానికి ముందే గోమయంతో వాకిలి అలికి ముగ్గు పెట్టాలి. ముంగిట్లో ముగ్గు లేకపోతే ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టదు.
- ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే ఇంట్లోని దారిద్య్రానికి కారణమైన ప్రతికూల శక్తులు, దృష్టి దోషాలు తొలిగిపోతాయి.
- శుక్రవారం ఇంట్లో నలుమూలలా సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పారద్రోలవచ్చు.
- ప్రతి శుక్రవారం విధిగా శ్రీలక్ష్మిదేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. పూజలో తామరపూలు, పారిజాతాలు, నీలం, తెలుపు రంగు శంఖు పూలు వినియోగిస్తే మంచిది.
- ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తేనే కలిపిన పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించాలి.
- ఇంట్లో డబ్బులు పెట్టే బీరువాలో పచ్చ కర్పూరాన్ని వస్త్రంలో చుట్టి ఉంచితే ఆర్ధిక సమస్యలు దూరమవుతాయి.
- ఉద్యోగంలో స్థిరత్వం కోసం, ఆర్ధిక వృద్ధి కోసం శుక్రవారం దుర్గాదేవికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే సత్ఫలితాలు ఉంటాయి.
- మీ పూజామందిరంలో ఇప్పటివరకు శంఖం లేకుంటే వెంటనే శంఖం మీ పూజా మందిరంలో ఉంచి ప్రతి రోజు పూజ తర్వాత ఇంటి యజమాని శంఖాన్ని పూరించడం వలన ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.
- శుక్రవారం మనీప్లాంట్ నాటడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ మనీ ప్లాంట్ ఎవరి ఇంటి నుంచి అయినా తెచ్చుకుంటే ఫలితాలు వేగంగా లభిస్తాయి.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉత్తరదిశలో వెండితో తయారు చేసిన ఏనుగులను ఉంచితే ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని ఆపడం మీ తరం కాదు.
- లక్ష్మీదేవి బిల్వపత్రాలలో స్థిర నివాసం ఉంటుందని శాస్త్రవచనం. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని బిల్వపత్రాలతో పూజించడం ఐశ్వర్య కారకం.
- సనాతన హిందూ సంప్రదాయంలో గోపూజకు విశిష్ట స్థానముంది. శుక్రవారం గోమాత తోక భాగం వైపు పసుపు కుంకుమలతో పూజించి, గోమాతకు పచ్చగడ్డి తినిపిస్తే తరతరాలుగా వస్తున్న దారిద్ర్య బాధలు తొలగిపోతాయి.
అన్నింటికన్నా ముఖ్యమైన పరిహారం ఏమిటంటే సూర్యోదయంకు ముందే నిద్ర లేవడం. బద్దకం, సోమరితనం లక్ష్మీదేవికి నచ్చని గుణాలు. కష్టించి పని చేసే వారికి శ్రీ మహాలక్ష్మి సదా అండగా ఉంటుంది.తన అనుగ్రహాన్ని ప్రసరిస్తూనే ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.