Hanuman Vaibhavam : హనుమంతుడు చిరంజీవి. సాక్షాత్తూ ఆ మహా శివుడే ఆంజనేయుడిగా అవతరించాడని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడి అంశంతో జన్మించిన హనుమంతుడు నేటికీ హిమాయలయాల్లో సజీవంగా ఉన్నాడని భావిస్తారు. చిరంజీవి అయిన హనుమంతుని నిత్యం సేవించడం వలన జీవితంలో కష్టనష్టాలకు దూరంగా ఉండవచ్చునని పెద్దలు అంటారు. ఈ కథనంలో హనుమద్వైభవం గురించి తెలుసుకుందాం.
నమ్మినబంటు ఆంజనేయుడు
వాల్మీకి రామాయణం ప్రకారం త్రేతా యుగంలో రాముడికి నమ్మిన బంటు ఆంజనేయుడు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన తర్వాత రామునికి లోకమంతా శూన్యమైంది. సీతాదేవి జాడ తెలియక లోకాలన్నీ నిర్మూలనం చేయాలనుకున్నాడు రాముడు. ఆ సమయంలో ఆంజనేయుని కలుసుకున్న శ్రీరామునిలో సీతమ్మ తప్పకుండా దొరుకుతుందన్న నమ్మకం కలిగింది. అదే హనుమ గొప్పదనం. ఎంతటి నిరాశ నిస్పృహలు కలిగినా హనుమ దర్శనంతో అవన్నీ పటాపంచలై పోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి.
లంకాపురి దహనం
సీతాన్వేషణకు బయలుదేరిన హనుమ లంకలో ప్రవేశించి భీభత్సం సృష్టించాడు. తనకు నిప్పు పెట్టాలని రాక్షస మూకలు ప్రయత్నిస్తే ఆ నిప్పుతోనే లంకను దహనం చేశాడు. సునాయాసంగా లంకలోని రాక్షసులను మట్టుబెట్టిన అంజనీ సుతుని ఆరాధిస్తే దుష్ట శక్తులు, పిశాచాలు దరిచేరవని నమ్మకం.
ధైర్యాన్నిచ్చే హనుమ మంత్రోచ్ఛారణ
ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ప్రశాంతంగా కూర్చొని 'ఓం పవన సుత హనుమాన్ కీ జై' అనేమంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు ఉచ్చరించడం వల్ల మనోబలం, ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు. ఈ మంత్రం వల్ల తక్షణ ఫలితాన్ని పొందడమే కాకుండా, అనూహ్యమైన శక్తి సొంతమవుతుంది
శ్రీ ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయ దండకం ప్రతి నిత్యం సంధ్యా సమయంలో పఠిస్తే మొండి రోగాలు, దుష్ట శక్తులు, పీడలు కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఆంజనేయస్వామి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవి ఈ దండకంలో పొందుపర్చారు. ఇందులో సంస్కృత పదాలు ఉచ్చరించడం వల్ల శబ్దశక్తి, మంత్రశక్తితో సానుకూల శక్తులు పెరుగుతాయి. అందువల్లే ఈ దండకం శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం.
హనుమాన్ చాలీసా
హనుమ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా పారాయణ ప్రతిరోజూ చేయడం వల్ల చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. హనుమ చాలీసా హనుమంతుని ఆలయంలో చదివితే కోటిరెట్ల అధిక ఫలం ఉంటుందని విశ్వాసం.
ఇప్పటికి హిమాలయాల్లో ధాన్యంలో చిరంజీవిగా ఉండే హనుమను ఆపద సమయంలో భక్తి శ్రద్ధలతో పిలిసే చాలు ప్రత్యక్షమై ఆపదలు తొలగించి రక్షిస్తాడని విశ్వాసం. హనుమ అనగానే మంగళవారం, శనివారం గుర్తుకొస్తాయి. కానీ ఈ రెండు రోజుల్లో మాత్రమే కాకుండా ప్రతిరోజూ హనుమను ఆరాధిస్తే ఆ హనుమ అనుగ్రహం సదా వెన్నంటే ఉంటుంది. జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఆపదలో ఉన్నారా? అయోమయానికి లోనయ్యారా? ఈ మంత్రం జపిస్తే అంతా సెట్!
మంగళవారం ఈ పరిహారాలు చేస్తే చాలు - రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తీరడం ఖాయం!