Congress on Ambedkar issue : డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ ప్రతిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అందుకు అమిత్ షా క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఖర్గే తెలిపారు. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.
'అమిత్ షాను తొలగించాలని చేయాలని డిమాండ్ చేశాం. కానీ అది జరగదని మాకు తెలుసు. అందుకే శాంతియుతంగా నిరసనలు చేపట్టాం. అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ఇతర అంశాలను లేవనెత్తుతోంది. బీజేపీ ఎంపీలు మమ్మల్ని పార్లమెంటులోకి రానీయకుండా అడ్డుకున్నారు. నన్ను నెట్టారు. నేను బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాను' అని ఖర్గే చెప్పారు.
#WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says, " ...they (bjp mps) stopped us at the door and did this to show their muscle power. they forcefully attacked us. i am not in a position to push anyone, but they pushed me. now they are accusing us that we pushed them...so… pic.twitter.com/01rRE3GaGt
— ANI (@ANI) December 19, 2024
'బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకం'
అప్పడు అదానీ గురించి, ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. 'పార్లమెంటు సమావేశాలకు కొన్నిరోజుల ముందు అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. ఆ అంశంపై చర్చ జరగకుండా బీజేపీ సర్వశక్తులా ప్రయత్నించింది. అదానీ అంశాన్ని మరుగునపడేయాలని భావించిన బీజేపీ ఎలాంటి చర్చ జరగకుండా వ్యూహరచన చేసింది. ఆ తర్వాత అమిత్ షా ప్రకటన వచ్చింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనావిధానం రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు వ్యతిరేకమని, మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఆయన గుర్తులు లేకుండా చేయాలన్నది వారి లక్ష్యం. హోంమంత్రి తన మనసులో ఉన్నది అందరి ముందు పెట్టారు. అందుకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయన రాజీనామా చేయాలని కోరాం' అని మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ తెలిపారు.
#WATCH | Delhi: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi says, " ...they want to erase the memories and contributions of ambedkar ji. we said the home minister (amit shah) should apologize and resign...today again they have started a new distraction. we were peacefully going to… pic.twitter.com/XkT3GF2TAo
— ANI (@ANI) December 19, 2024
'రాహుల్ గాంధీ కావాలనే చేశారు'
రాహుల్ గాంధీ ఈ రోజు చేసిన పనికి క్షమాపణలు చెబుతారని అనుకున్నారని, కానీ ఆ పని చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. 'ఖర్గే, రాహుల్‌గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంటు వద్ద వారి వల్ల జరిగిన తప్పునకు, పాపానికి క్షమాపణలు చెబుతారని మేము అనుకున్నాం. కానీ వారు క్షమాపణ కోరలేదు. వారు మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారో నాకైతే అర్థం కాలేదు. అక్కడ కూడా వారి అహంకారం కనిపించింది. నేను 12సార్లు లోక్‌సభ లేదా శాసనసభ సభ్యుడిగా ఉన్నాను. శాసనసభ, పార్లమెంటు సభ్యుల వ్యవహారశైలిని చూశాను. ఇప్పుడు పార్లమెంటులో జరిగిన ఘటనను ఊహించలేను. రాహుల్ గాంధీ ఓ గూండాలా ప్రవర్తించారు.' అని శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు.
#WATCH | Delhi: Union Minister Shivraj Chouhan says, " ... rahul gandhi behaved like a goon. he started pushing there. our elderly mp pratap sarangi fell and he was seriously injured on the head. he was admitted to the icu and he is still under treatment... he was unconscious. his… https://t.co/OJMYpHUz45 pic.twitter.com/udf1l5ym0D
— ANI (@ANI) December 19, 2024
పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఇరువర్గాల ఆందోళనలతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు.