Sai Baba Idol 3D Scanning : షిర్డీలోని సాయిబాబా పాలరాతి విగ్రహానికి కచ్చితమైన ప్రతిరూపాన్ని భవిష్యత్తులో తయారు చేసేందుకు వీలుగా- సాయినాథుని విగ్రహాన్ని త్రీడీ స్కానింగ్ చేయనున్నారు. 70ఏళ్ల క్రితం ఇటాలియన్ మార్బుల్తో తయారు చేసిన ఈ విగ్రహం ప్రస్తుత పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు డిసెంబర్ 20న త్రీడీ స్కానింగ్ చేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్ తెలిపింది.
నీళ్లు, పాలతో అభిషేకం వల్ల!
సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠానంతరం పాలు, నీళ్లతో అభిషేకం చేస్తున్నారు. దీంతో విగ్రహం క్రమంగా దెబ్బతినడాన్ని సాయిబాబా సంస్థాన్ అధికారులు గమనించారు. పాలరాయి సహజంగా చల్లగా ఉంటుంది. కాబట్టి వేడి నీరు, పెరుగు, పాలు వల్ల విగ్రహం దెబ్బతింటుందని సాయిబాబా సంస్థాన్ ఆలయ అధికారులకు నిపుణులు వివరించారు. విగ్రహం దెబ్బతినకుండా ఉండేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. అందుకు తగ్గట్టుగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు అధికారులు. అయినప్పటికీ సాయిబాబా విగ్రహం కాలక్రమేణా దెబ్బతింటున్నట్లు వెల్లడైంది.
సాయి విగ్రహం త్రీడీ స్కానింగ్
అందుకే షిర్డీలోని సాయిబాబా విగ్రహానికి సంబంధించిన డేటాను త్రీడీ స్కానింగ్ ద్వారా భద్రపరచాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ త్రీడీ డేటాను ఉపయోగించి మళ్లీ అసలైన విగ్రహం లాంటిదాన్ని తయారు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు మ్యూజియం నిపుణులు డిసెంబరు 20న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని త్రిడీ స్కానింగ్ చేయనున్నారు.
కాసేపు ఆలయం మూసివేత
సాయిబాబా విగ్రహం త్రీడీ స్కానింగ్ చేసే సమయం- డిసెంబరు 20న మధ్యాహ్నం 1.45 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు సాయి సంస్థాన్ తెలిపింది. ఆ సమయంలో సాయి దర్శనం కోసం భక్తులను అనుమతించమని పేర్కొంది. సాయిబాబా వాడిన రాయి, చెక్క చెప్పులు, సట్కా తదితర వస్తువులను భద్రపరిచేందుకు అవసరమైన పూత, ప్రత్యేక రసాయనాలు వేసే ప్రక్రియ ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో జరుగుతోందని వెల్లడించింది.
"షిర్డీ సాయి దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని 70 ఏళ్ల క్రితం మా తాతయ్య బాలాజీ తాలిం తయారు చేయించారు. ఆ సాయి విగ్రహం తాలుక అసలైన ప్రతిరూపం మా వద్ద ఉంది. షిర్డీ సాయి విగ్రహానికి త్రీడీ స్కానింగ్ చేయిస్తుండడం మంచి నిర్ణయం." అని శిల్పి రాజీవ్ తలీమ్ అన్నారు.