Doing Business with Illegal Immigrants in Hyderabad : దేశ, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన అక్రమ వలసదారులతో తోపుడుబండ్లు పెట్టించి వ్యాపారం సాగిస్తున్న దళారుల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, జియాగూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా చిరువ్యాపారులు రోడ్లను ఆక్రమించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చలానాలు, కేసులు నమోదు చేసేందుకు చిరునామా అడిగితే తమ పేరుతో ఆధార్, ఓటరు గుర్తింపుకార్డులు, మొబైల్ ఫోన్లు వంటివి ఏమీ లేవన్నారు.
వీళ్లే ఎందుకంటే :తాము ఎక్కడ నుంచి వచ్చామనేది చెప్పకుండా ఏమార్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాదాపు 40 మంది బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. వీరిని పనిలో కుదుర్చుకున్న వ్యక్తిని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడు తిరగబడినట్టు సమాచారం. వలస వచ్చిన వాళ్లల్లో కొందరికి పాన్‌మసాలా ప్యాకెట్ కొనిస్తే చాలు రోజంతా పనిచేస్తారు. మరికొంతమందికి పూట భోజనం పెట్టిస్తే రేయింబవళ్లు కష్టపడతారు. సొంతూల్లో ఉపాధిలేక పొట్టకూటి కోసం పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, యూపీ, రాజస్థాన్ నుంచి వేలాది మంది నగరానికి వలస వస్తున్నారు.