WTC India Chances :2025 వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరగా, రెండో స్థానం కోసం ఆయా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరాలన్న టీమ్‌ఇండియా ఆశలు ఆవిరవుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు ఓటమితో భారత్ ఫైనల్ అవకాశాలు పూర్తిగా సంకిష్టంగా మారాయి.
- ఆస్ట్రేలియాకు తాజా విజయంతో ఫైనల్ చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ప్రస్తుతం ఆసీస్ 61.46 పాయింట్ పర్సెంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
- ప్రస్తుత డబ్ల్యూటీసీ ఈ సైకిల్‌లో భారత్ ఆడాల్సింది ఇంకో మ్యాచ్ మాత్రమే. బాక్సింగ్ డే టెస్టులో ఓటమితో ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. టీమ్ఇండియా ప్రస్తుతం 52.78 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టులో గెలిచినా, టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి.
- కొత్త సంవత్సరంలో ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో శ్రీలంకతో ఆసీస్ రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో ఆసీస్ 0- 2 తో ఓడితే, భారత్‌కు ఛాన్స్ ఉంటుంది. అప్పుడు భారత్ ఖాతాలో 55.26 పర్సెంటేజీ ఉంటుంది. ఆస్ట్రేలియా 53.51 శాతానికి పడిపోతుంది. ఇక శ్రీలంక 53.85 శాతం వద్దే నిలిచిపోతుంది. అయితే ఆస్ట్రేలియాపై భారత్ ఆఖరి టెస్టులో గెలిస్తేనే ఈ సమీకరణాలు ముందుకొస్తాయి.
- ఒకవేళ శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు డ్రా అయితే, అప్పుడు మెరుగైన స్థానంలో ఉన్న జట్టు టాప్ 2 లోకి చేరుతుంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో చివరి టెస్టులో భారత్ నెగ్గినప్పటికీ, శ్రీలంకతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా, టీమ్‌ఇండియా అవకాశాలు గల్లంతే.
- బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో చివరి టెస్టులో భారత్ ఓడినా, మ్యాచ్‌ను డ్రా గా ముగించినా అధికారికంగా ఫైనల్ రేసు నుంచి టీమ్‌ఇండియా నిష్క్రమిస్తుంది.
సఫారీలదే తొలి అడుగు
పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఆ జట్టు 66.67 శాతంతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో సఫారీలు తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్నారు. ఇక ఫైనల్‌కు చేరే ఆ రెండో జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.