IND VS ENG 2nd ODI : ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా టీమ్ఇండియా ప్రస్తుతం వన్డే సిరీస్‌ను ఆడుతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఈ పోరులో ఇప్పటికే ఒక గేమ్ నెగ్గి మంచి జోష్‌లో ఉంది. ఇక ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. అయితే తొలి వన్డేలో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకున్న మేనేజ్మెంట్, రిషభ్ పంత్‌ను బెంచ్‌కు పరిమితం చేసింది. అంతే కాకుండా కేఎల్‌ను కాదని అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించింది. ఇక ఆ మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు.
అయితే కేఎల్‌ను కాకుండా అక్షర్‌ను ముందుకు పంపించడం వెనక రీజన్ ఏంటా అంటూ క్రీడాభిమానులు సతమతమవుతున్నారు. కుడి-ఎడమ కాంబినేషన్ కోసమే వాళ్లు ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్‌తో మిగతా వన్డేల్లోనూ, అలాగే రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పంత్‌కు తుది జట్టులో అవకాశాలు రావడం కష్టమేనంటూ క్రికెట్ వర్గాల మాట.
మరోవైపు మిడిలార్డర్‌లో పంత్ ఉంటే ప్రత్యర్థులు కాస్త భయపడతారని, జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడటం తన స్పెషాలిటీ అని మరికొందరు కొనియాడారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలోఉంచుకొని ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాను. టాప్ -7 బ్యాటర్లలో కచ్చితంగా ఎడమ చేతివాటం ప్లేయర్లు ఉండాలి. ఈ తొలి వన్డే తర్వాత నాకు అక్షర్‌ను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్‌గా అనిపిస్తోంది. టెస్టుల్లోనూ అతడు ఎంతో అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. వన్డేల్లోనూ స్పిన్నర్లపై ఎదురుదాడి చేస్తూ చెలరేగిపోతున్నాడు. అయితే ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండనుంది. అందుకే మిడిలార్డర్‌లో అక్షర్ సరిపోతాడని నా అభిప్రాయం. తన ఉంటే బౌలింగ్ ఆప్షన్ కూడా మన వద్ద ఉన్నట్లే. కేఎల్ రాహుల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ తన గురించి కంగారు పడనవసరం లేదు. ఐసీసీ టోర్నీలోనూ ప్రధాన వికెట్ కీపర్‌గా కేఎల్నే ఎంచుకోవచ్చు. కానీ రిషభ్‌కు మాత్రం ఛాన్స్‌లు తక్కువే" అని మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
సినిమా చూస్తుంటే కెప్టెన్ కాల్ వచ్చింది - లేకుంటే ఆ పని చేసుండేవాడిని : శ్రేయస్ అయ్యర్
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో భారత్ ఘన విజయం - అదరగొట్టిన శుభమన్ గిల్