T20 World Cup 2024 :టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్‌పై సస్పెన్షన్ వీడింది. పొట్టి సమరంలో స్థానం కోసం కొన్నివారాల పాటు ఎదురుచూసిన కేఎల్ రాహుల్‌కు నిరాశే మిగిలింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15మంది బృందంలో రాహుల్‌కు చోటు కల్పించకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయంట్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ చక్కటి ఫామ్ కనబరుస్తున్న రాహుల్ 9 ఇన్నింగ్స్‌లలో 378 పరుగులు చేసినప్పటికీ సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు.
- టాపార్డర్‌తో పాటు వికెట్ కీపర్లకు లేని లోటు -భారత జట్టు ఎంపికలో టాపార్డర్‌తో పాటు వికెట్ కీపర్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా టాప్ ఛాయీస్‌లను మాత్రమే ఎంచుకోగలిగే అవకాశం ఉంది. ఈ రెండు కేటగిరీల్లోనూ కేఎల్ రాహుల్ స్కిల్స్ కన్నా సంజూ శాంసన్, కోహ్లీ సహా మిగిలిన వాళ్లే మెరుగ్గా అనిపించడం ఒక కారణం. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ప్రదర్శన ఆధారంగా చూసుకుంటే అతనికంటే మెరుగైన స్థానంలో సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు నిలిచారు.
- రాహుల్‌కు సరిపడా అవకాశాలే ఉన్నా -గతంలో రెండు టీ20 వరల్డ్ కప్‌లలో ఆడిన కేఎల్ రాహుల్, తనకు అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోయాడు. మోడరన్ డే టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లే ఓవర్లలో రాణించడం గతంలో కంటే కీలకంగా మారిపోయింది. అలాంటి సందర్భంలో రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా దిగి పరుగులు సాధించలేకపోయాడు. ఫీల్డింగ్‌లోనూ కుదురుకోలేకపోవడం ఈ ఆటగాడికున్న మరో లోపం. ఇదే కాకుండా రాహుల్ కొనేళ్లుగా మిడిల్ ఆర్డర్‌లో ఆడింది లేదు. వీటిని దృష్టిలో పెట్టుకునే సెలక్షన్ కమిటీ రాహుల్ కంటే శివమ్ దూబె, రింకూ సింగ్‌లను తీసుకోవడమే బెటర్ ఆప్షన్ అనుకుని ఉండొచ్చు.
- కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌కు దూరం:
2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి గురైంది. ఆ సమయంలో భారత జట్టులో దూకుడైన బ్యాటింగ్ లేకపోవడమే ప్రధాన లోపమని అంతా అనుకున్నారు. అప్పుడు ఆ జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ ప్రతిభతో పోల్చి చూస్తే, చాలా మంది యువ క్రికెటర్లు మోడరన్ టీ20 క్రికెట్‌లో రాణించగలమని నిరూపించుకునేలా మెరుగైన ప్రతిభ కనబరిచారు. అది రాహుల్‌ను పక్కకుపెట్టేసేందుకు ఇంకో కారణం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, గాయాల కారణంగా రాహుల్ టీ20 ఫార్మాట్ కు దూరం కావడం మరో ప్రధాన లోపంగా కనిపిస్తుంది. అదే కోణంలో చూస్తే రిషబ్ పంత్ గాయం కారణంగా దూరమైనా రీఎంట్రీలో అద్భుతంగా రాణిస్తూ సెలక్టర్ల చూపు తన వైపుకు తిప్పుకున్నాడు. కేఎల్ రాహుల్ విషయంలో మాత్రం అది జరగలేదు.
కాగా, ఈ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. 3 అర్ధసెంచరీలతో మొత్తం 378 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 48 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో రెండు సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. అయితే సీజన్ రన్ ఛేజ్‌ను పరిశీలిస్తే, రాహుల్ 9 గేమ్‌లలో 378 పరుగుల స్ట్రైక్ రేట్ 144.27 గా ఉంది.