T20 World Cup 2024 Final:2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఫైట్ భారత్- సౌతాఫ్రికా మధ్య జరగనుంది. బర్బాడోస్ వేదికగా జూన్ 29న ఈ ఫైనల్ జరగనుంది. ఈ అవకాశం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నాయి. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న ఇరుజట్లు ఛాంపియన్‌గా నిలవాలని ఆశిస్తున్నాయి. అయితే సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలిచి దాదాపు 26ఏళ్లు కాగా, టీమ్ఇండియా 11ఏళ్ల నుంచి ఐసీసీ ఈవెంట్లో ఛాంపియన్‌గా నిలువడానికి ఎదురుచూస్తోంది.
26ఏళ్ల నుంచి సౌతాఫ్రికా వెయిటింగ్
సౌతాఫ్రికా చివరిసారి 1998 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. బంగ్లాదేశ్ ఢాకా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 245 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కి దిగిన సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. 37 పరుగులు, 5 వికెట్లతో అదరగొట్టిన ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
ఇదే సౌతాఫ్రికా గెలిచిన ఏకైక ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం. సౌతాఫ్రికా జాబితాలో ఒక్క వన్డే, టీ20 ప్రపంచకప్ కూడా లేదు. దాదాపు 26 ఏళ్లుగా సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్య కాలంలో పలుమార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు చేరినా అక్కడ సఫారీలకు నిరాశ తప్పలేదు. ఇక గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శనతో సౌతాఫ్రికా సెమీస్ చేరింది. కానీ, సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టిన సౌతాఫ్రికా ఓడింది. దీంతో మరోసారి సౌతాఫ్రికా భంగపడింది. అయితే ఈసారి ఇంకో అడుగు ముందుకేసి తొలి వరల్డ్‌కప్ ఫైనల్ ఆడబోతోంది. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది.