Story On Laknavaram Lake Tourism : లక్నవరం కొత్త అందాలతో రారమ్మంటూ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. సరస్సులో బోటింగ్ ఇప్పటికే మధురానుభూతులు పంచుతుంటే తాజాగా అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన మూడో ద్వీపం అందాలు కట్టిపడేస్తున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన ఈ ఐలాండ్‌ని తిలకించేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు.
'గోవా'ను మరిపించే టూరిస్ట్ స్పాట్ : చుట్టూ పచ్చని చెట్లు ద్వీపాల మధ్యలో వంపులు తిరిగిన సరస్సు, నడుస్తుంటే కదలాడుతూ వింత అనుభూతి కలిగించే వేలాడే వంతెన. బస చేసేందుకు స్టార్ హోటల్ సదుపాయాలు స్విమ్మింగ్ పూల్‌లో స్నానాలు, నోరూరించే రుచులు ఇంతకంటే ఆహ్లాదం పొందడానికి ఇంకేం కావాలి. అందుకే లక్నవరం పర్యాటకులకు స్వర్గధామంలా మారిపోయింది. మాల్దీవులను గుర్తుకుతెచ్చే విధంగా లక్నవరం అందాలు పోటీ పడుతూ సందర్శకులను రారామ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. సహాజసిద్ధ అందాలకు నెలవైన ఈ ప్రదేశం పర్యాటకుల మదిని దోచేసే అద్భుత ప్రాంతంగా మారిపోయింది.
వరంగల్‌కు 78 కిలోమీటర్ల ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు అందాలు వీక్షించాలే కానీ మాటల్లో వర్ణించనలవి కాదు. చుట్టూ పచ్చదనంతో వరంగల్ నుంచి లక్నవరానికి వెళ్లే దారే చూపరులను కట్టిపడేస్తుంది. ఇక ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే ఆహ్లాదకర వాతావరణం పరవశింపచేస్తుంది. వేలాడే ఊయల వంతెన చూసి మనసు ఊయలలూగుతుంది.
ఆధునాతన సౌకర్యాలతో మూడో ఐలాండ్ : పెద్దవాళ్లే చిన్నపిల్లల్లా మారితే ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. బోటు షికారు చేస్తూ హాయిగా, ఆనందంగా ఉల్లాసం పొందుతారు. అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన మూడో ఐలాండ్‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తీగల వంతెన ద్వారా మొదటి ద్వీపానికి చేరుకుంటే అక్కడి నుంచి రెండో ద్వీపానికి, మూడో ద్వీపానికీ తీసుకెళ్లడానికి స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న సందర్శకులు ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండి సహజ సిద్ధ అందాలను తనివితీరా తిలకిస్తున్నారు. వేలాడే వంతెనల మధ్య నడుస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేమని పర్యటకులు చెబుతున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కించుకున్న రామప్పను ఆనుకుని ఉన్న ఈ సరస్సును మరింత అభవృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని పర్యటకులు కోరుతున్నారు.
'గోవా'ను మరిపించే టూరిస్ట్ స్పాట్ - మన తెలంగాణలోనే - లేట్ చేయకుండా వెళ్లొచ్చేయండి
వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? - ఈసారి జాలీగా 'తెలంగాణ మాల్దీవ్స్'కు వెళ్లిరండి