Sreeja Akula Paris Olympics 2024 : ఆమె తక్కువగా మాట్లాడుతారు. కానీ ఎప్పుడూ ఆమె విజయాలే ఎక్కువ మాట్లాడతాయి. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్‌కు పాల్గొననుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గురించి చెప్పుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.
ఆ ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్‌లోకి
మా నాన్న ప్రవీణ్ కుమార్ ఇన్సూరెన్స్ సంస్థలో, అమ్మ సాయిసుధ ఎల్‌ఐసీలో పనిచేస్తున్నారు. అక్క రవళికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటోంది. నేను టేబుల్ టెన్నీస్‌ను ఎనిమిదేళ్లప్పుడు మొదలుపెట్టాను. నిజానికి నాన్నకి ఈ ఆటంటే చాలా ఇష్టం. పాఠశాల స్థాయిలో ఆడేవారు. కానీ ఆర్థికంగా మద్దతు లేక ముందుకు వెళ్లలేకపోయారు. మా అక్క చిన్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేది. దాంతో తనని టీటీలో ప్రోత్సహించారు. మా అక్క రవళి రోజూ ప్రాక్టీస్‌కు వెళ్లేది. మెడల్స్ గెలిచేది. నేనూ ఆడుతానన్నాను. దానికితోడు నేను చిన్నప్పుడు చాలా నిరసంగా ఉండేదాన్ని. వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువే. స్ట్రాంగ్ అవుతాననీ, ఫిట్నెస్ ఉంటుందని, గ్లోబల్ అకాడమీలో మా నాన్న జాయిన్ చేశారు. అలా ఈ క్రీడలోకి ఎంట్రీ ఇచ్చాను." అని శ్రీజ తెలిపారు.
ఆ రెండింటి మధ్య డైలమా
చదువా? ఆటా అనే రెండింటి మధ్య నాకు ఓ డైలమా ఉండేది. పదోతరగతి వరకూ అది అలాగే కొనసాగింది. అయితే 2009లో తొలిసారి నేషనల్ మెడల్ వచ్చినప్పటి నుంచి ఆటవైపు మొగ్గు చూపాను. అమ్మానాన్నలిద్దరూ జాబ్స్ చేయడం వల్ల చాలా కష్టం అయ్యింది. నాన్నకి చాలాసార్లు బదిలీ అయ్యేది. అప్పుడు అమ్మ అన్నీ చూసుకోవాల్సి వచ్చేది. ఆఫీసు మధ్యలో ఇంటికి వెళ్లడం, రావడం జరిగేది. మాకోసం బైక్ నడపడం నేర్చుకుంది. మా అమ్మే టీటీ ప్రాక్టీస్ కు తీసుకెళ్లేది. ఆమె తీసుకొచ్చేది. మా ఇంట్లో తాతయ్య, నానమ్మ ఉండేవారు. అమ్మ మాతో ఉంటే నానమ్మ ఇల్లు చూసుకొనేది.
కొందరు మమ్మల్ని అలా అనేవారు!
అమ్మాయిలకు చదువుంటే చాలు ఆటలెందుకని కొందరు అనేవారు. కానీ అక్కా, నేను బాగా చదివేవాళ్లం. "మాకు ఏది ఇష్టమో అదే చేయాలని అనుకునేవారు అమ్మానాన్న. మా అమ్మ అయితే మేం చదువులో ఎక్కడా వెనకబడకుండా ఉండేలా చూసుకొనేది. రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టులో కూడా మేము చదువుకొనేవాళ్లం. ఇండియాలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా అమ్మ తోడుగా ఉండేది. నాకు చదువు, టీటీ తప్ప మరో వ్యాపకం లేదు. మా గేమ్స్, చదువు కోసమే అమ్మానాన్నలు తాపత్రయపడేవారు.