Delhi Polls Cash Promises To Women : ఈసారి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. వారు మొగ్గుచూపే పార్టీకే విజయావకాశాలు పెరుగుతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే గుర్తించాయి. అందుకే మహిళలకు ప్రతినెలా ఆర్థికసాయాన్ని అందించే పథకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు పోటీపడి మరీ ప్రకటించాయి. పథకాల పేర్లు వేరు కావచ్చు కానీ వాటన్నింటి లక్ష్యం మాత్రమే ఒక్కటే. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 అందిస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్యారీ దీదీ యోజన ద్వారా మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందిస్తామని బీజేపీ సైతం వెల్లడించింది. తమకు నెలవారీ ఆర్థిక సాయాన్ని అందించేందుకు అన్ని పార్టీలూ సిద్ధమైనప్పటికీ, ఏ పార్టీని మహిళలు విశ్వసించబోతున్నారు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
46.2 శాతం మంది ఓటర్లు మహిళలే
దిల్లీ ఓటర్లలోని 46.2 శాతం మంది మహిళలను ప్రసన్నం చేసుకునే దిశగా క్షేత్ర స్థాయిలో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దేశ రాజధాని దిల్లీలో మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు ఉన్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 6 మధ్యకాలంలో కొత్తగా ఓటు నమోదు కోసం దిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్‌కు 5.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో దాదాపు 70 శాతం దరఖాస్తులు మహిళలవే. అంటే మహిళా ఓటర్ల సంఖ్య మరింత పెరగొచ్చు.
మహిళల మనసులో మరో మాట!
నెలవారీ ఆర్థిక సాయం అందించే స్కీంపై రాజకీయ పార్టీల ఆలోచన ఒకలా ఉంటే, మహిళా ఓటర్ల మనసులో మాట మరోలా ఉంది. కొంతమంది దిల్లీ మహిళలు ఈ స్కీమ్ అమలు కాకపోవచ్చని సందేహం వెలిబుచ్చుతున్నారు. నిధుల కొరత సాకుతో నెలవారీ ఆర్థిక సాయం స్కీమ్‌ను అటకెక్కించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ స్కీమ్‌ను ప్రారంభించినా, దీర్ఘకాలం పాటు కొనసాగించకపోవచ్చని మరికొందరు మహిళలు అంటున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం నడుచుకునే పార్టీ ఏది? నెలవారీ ఆర్థిక సహాయ పథకాన్ని తప్పకుండా అమలు చేయగల పార్టీ ఏది? అనేే ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలోనే తాము ఉన్నామని దిల్లీ మహిళలు చెబుతున్నారు. పోలింగ్ తేదీ రోజు వాటికి సమాధానాన్ని తామే చెబుతామని పేర్కొంటున్నారు.
దిల్లీ మహిళలు ఏమన్నారంటే?
- "నెలకు రూ.2,500 వస్తే మా పిల్లల పుస్తకాల ఖర్చులకు, ఇతర అత్యవసరాలకు పనికొస్తాయి. అయితే ఇది ఎన్నికల వాగ్దానమే. అమలు కాకపోవచ్చు" అని తూర్పు దిల్లీకి చెందిన గృహిణి నిషా వర్మ తెలిపారు.
- "మహిళల సంక్షేమం గురించి రాజకీయ పార్టీల ఆలోచన బాగుంది. అయితే మహిళలకు ఉద్యోగావకాశాలను సృష్టించడంపై, వారికి భద్రతను కల్పించడంపైనా ఫోకస్ చేయాలి. ప్రతినెలా డబ్బులిస్తే మహిళలకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కావు" అని దక్షిణ దిల్లీకి చెందిన యువ ప్రొఫెషనల్ ప్రియా శర్మ చెప్పారు.
- "నేను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. నా లాంటి వాళ్లకు నెలవారీ ఆర్థిక సహాయ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఎన్నికల కంటే ముందు ఈ స్కీమ్‌ను ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడే దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు?" అని పాత దిల్లీ నివాసి రుఖ్సర్ అన్సారీ ప్రశ్నించారు.
- "నెలవారీ సాయం చేస్తే మాకు మేలు జరుగుతుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. కొంతమేర ఇంటి సామగ్రికి ఆ డబ్బును ఖర్చు చేస్తాం. మా పిల్లల విద్యా అవసరాలను తీర్చుకుంటాం. మహిళల ఆరోగ్య సంరక్షణపైనా పార్టీలు దృష్టి పెట్టాలి" అని పశ్చిమ దిల్లీకి చెందిన గృహిణి ఆశా కుమారి పేర్కొన్నారు.
- "నాలాంటి ఆదాయ వనరులు లేని మహిళలకు నెలవారీ సహాయ స్కీమ్ ఉపయోగపడుతుంది. దానివల్ల మాకు కొంచెం ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడానికి నిత్యావసరాల ధరలను, పన్నులను ప్రభుత్వం పెంచకూడదు" అని దిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన సీనియర్ సిటిజన్ గీతా దేవి తెలిపారు.
దిల్లీలో పోటాపోటీగా ఉచితాల జల్లు- ప్రజాసమస్యల ఊసే లేదు! ఎన్నికల్లో వీటి ప్రభావమెంత?
ఓటర్ల జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర - ఈసీకి కేజ్రీవాల్ ఫిర్యాదు!