How to Make Tomato Pandumirchi Pachadi : సీజనల్‌గా లభించే వాటిలో పండుమిర్చి కూడా ఒకటి. ప్రస్తుతం ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. కాగా, చాలా మంది పండుమిర్చితో ఏడాదిపాటు నిల్వ ఉండేలా పచ్చడి పెట్టుకుంటారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుని కావాల్సినప్పుడల్లా తాలింపు పెట్టుకుని వేడివేడి అన్నంలో తింటుంటారు. ఎన్నిసార్లు తిన్నా ఈ పచ్చడి అస్సలు బోర్ కొట్టదు. కారణం దీని రుచి సూపర్‌గా ఉండటమే.
అయితే చాలా మందికి పండుమిర్చి పచ్చడి అంటే చింతపండు లేదా చింతకాయ వేసి చేసినదే తెలుసు. కానీ టమాటలు, పండుమిర్చితో కూడా అద్భుతమైన పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కా కొలతలతో తయారు చేసుకుంటే ఇది కూడా నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సినవి, తయారీ విధానంపై ఓ లుక్కేద్దాం రండి.
కావాల్సిన పదార్థాలు:
- మెంతులు - 1 టేబుల్ స్పూన్
- టమాటలు - అర కేజీ
- చింతపండు - 50 గ్రాములు
- నూనె - పావు కప్పు
- పండు మిర్చి - పావు కేజీ
- ఉప్పు - 65 గ్రాములు
- పసుపు - 1 టీ స్పూన్
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 25 గ్రాములు
తాలింపు కోసం:
- నూనె - పావు కప్పు
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- పచ్చి శనగపప్పు - అర టీ స్పూన్
- మినపప్పు - అర టీ స్పూన్
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 4
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
- టమాటలను శుభ్రంగా కడిగి తేమ లేకుండా పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఆపై మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచాలి.
- పండు మిర్చిని కూడా శుభ్రంగా కడిగి అస్సలు తేమ లేకుండా తుడిచి పూర్తిగా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. తడి అనేది లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- చింతపండును కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే గింజలు, పొట్టు తీసేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్‌లో మెంతులు వేసి సిమ్‌లో దోరగా వేయించుకుని పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడిలా చేసి పక్కన ఉంచాలి.
- మరోసారి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పావు కప్పు నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న టమాట ముక్కలు, శుభ్రం చేసుకున్న చింతపండు వేసి కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి.
- టమాట ముక్కలు మెత్తగా ఉడికి నీరు ఇంకి నూనె పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిక్సీజార్ తీసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. ఆపై అందులోకి పండు మిర్చి ముక్కలు, ఉప్పు , పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి పూర్తిగా చల్లారిన టమాట గుజ్జు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ముందే ప్రిపేర్ చేసుకున్న మెంతి పిండి వేసి ఇవన్నీ బాగా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఎయిర్ టైట్ గాజు జాడీలో స్టోర్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకుంటే సరి.
- తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి.
- ఆపై ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. చివరగా ఇంగువ వేసి కలిపి కొంచెం పచ్చడిని వేసి ఓ రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇలా తాలింపు పెట్టుకున్న పచ్చడిని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే చాలు. ఎంతో అద్భుతంగా ఉండే టమాట పండుమిర్చి పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
మీరు ఎన్నడూ తిని ఉండరు - "పచ్చి టమాటా పచ్చడి" - టేస్ట్ నెక్స్ట్ లెవల్ అంతే!
అమ్మమ్మల కాలం నాటి "చింతకాయ కొబ్బరి పచ్చడి" - నోట్లో నీళ్లు ఊరిపోవడం గ్యారెంటీ!