Nirmala Sitharaman On Budget : కేంద్ర ప్రభుత్వం తీసుకునే రుణాల్లో 99 శాతాన్ని వచ్చే (2025-26) ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాల కోసమే వెచ్చిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు రూ.15.48 లక్షల కోట్ల మేర మూలధన వ్యయాలు చేయనుందని వెల్లడించారు. ఇది దేశ జీడీపీలో 4.3 శాతానికి సమానమని ఆమె చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సమాధానాలు ఇచ్చారు. దేశ ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గకూడదంటే ప్రభుత్వం వైపు నుంచి తగిన చర్యలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే తమ కసరత్తు జరుగుతోందన్నారు.
రాష్ట్రాలకు రూ.25.01 లక్షల కోట్లు
'వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4 శాతానికి మించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే భారత ప్రభుత్వం తీసుకునే రుణాలను రెవెన్యూ వ్యయాల కోసం వెచ్చించడం లేదు. మూలధన ఆస్తులను తయారు చేయడంపై ఫోకస్ పెట్టాం. 2025-26లో రంగాలవారీగా పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి రూ.1.71 లక్షల కోట్లు, గ్రామీణ వికాసం కోసం రూ.2.67 లక్షల కోట్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.6.45 లక్షల కోట్లు, ఆరోగ్యం, విద్యా రంగాలకు రూ. 2.27 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ.4.92 లక్షల కోట్లను కేటాయిస్తాం' అని ఆర్థికమంత్రి వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపుల్లో ఎలాంటి కోతలూ ఉండవని ఆమె తేల్చి చెప్పారు. వారికి రూ.25.01 లక్షల కోట్లను తప్పకుండా అందిస్తామన్నారు.
బడ్జెట్ రూపకల్పన పెద్ద సవాల్‌గా
'ఈసారి చాలా అస్థిర పరిస్థితుల నడుమ బడ్జెట్‌ను దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక వాతావరణం సంక్లిష్టంగా ఉంది. ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. గత పదేళ్లలో అనూహ్యంగా మారిపోయిన ప్రపంచ కాలమాన పరిస్థితులు బడ్జెట్ రూపకల్పనను పెద్ద సవాల్‌గా మార్చాయి. అయినప్పటికీ మన దేశ అభివృద్ధి అవసరాలు, ఆర్థిక ప్రాధాన్యతలను బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్‌కు రూపకల్పన చేశాం. ప్రస్తుతం దేశంలో ఆహార ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలోనే ఉంది. ద్రవ్యోల్బణ నిర్వహణకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి కట్టడి చేయగలిగిన 2- 6 శాతం పరిధిలోనే ఉంది' అని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు.
VIDEO | " the government intends to use about 99% of borrowed resources to finance effective capital expenditure in the upcoming year (2025-26). the sectoral outlays in the year 2025-26 include agriculture which gets rs 1.71 lakh crore, rural development which gets 2.67 lakh… pic.twitter.com/xnFtHy4qUs
— Press Trust of India (@PTI_News) February 11, 2025
రూపాయి బలహీనత అందుకే
'మిడిల్ ఈస్ట్‌లో అస్థిరత, రష్యా- ఉక్రెయిన్ యుద్ధాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. వీటితో పాటు వివిధ అంతర్జాతీయ, దేశీయ కారణాల ప్రభావంతో భారత రూపాయి బలహీనపడింది. భారత్‌తో పాటు ఇతరత్రా ఎన్నో దేశాల కరెన్సీలు కూడా డీలాపడ్డాయి' అని నిర్మల గుర్తు చేశారు.
'140కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ ఇది'- 'బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స'
సెంట్రల్ బడ్జెట్‌తో ఎవరికెంత లాభం? కంప్లీట్ హైలైట్స్ మీకోసం!