How to Be a Happy Married Couple: మీ భాగస్వామికి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? కనీసం హగ్, కిస్ అయినా ఇచ్చారా? ఇవన్నీ ప్రేమికులు చేసుకుంటారు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు మనకెందుకు అనుకుంటున్నారా? కానీ, ఇలా అనుకోకుండా భార్యభర్తలిద్దరూ అప్పుడప్పుడూ ఇలా గడిపితే వారిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందంటున్నారు నిపుణులు. ఇంకా, కేవలం ప్రేమను పంచుకోవడమే కాకుండా.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఓదార్పునివ్వడం, సర్‌ప్రైజ్ చేసుకోవాలని అంటున్నారు. అయితే వీటికి కాస్త రొమాన్స్ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి మరింత పెరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందుకోసం ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐ లవ్యూ చెబుతున్నారా?
'ఐ లవ్యూ' అంటే ప్రేమికులే చెప్పుకుంటారని అనుకుంటుంటారు చాలా మంది. కానీ, భార్యాభర్తలు కూడా ఈ మాట చెప్పుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా చెప్పుకోకపోతే ప్రేమ లేదని కాదు.. అలాగని రోజూ చెప్పినా బోర్ కొడుతుందంటున్నారు. అందుకే అప్పుడప్పుడూ విభిన్న రీతుల్లో, వేర్వేరు భాషల్లో ఐలవ్యూ చెప్పడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఇది ఇద్దరికీ సరదానూ పంచుతుందట. ఇక వాలెంటైన్స్ డే, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో మీ భాగస్వామికి నచ్చిన మంచి కానుక కొని దాన్ని ఇస్తూ ఈ మాట చెబితే మరింత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
![how to be a happy married couple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23519904_how_to_be_a_happy_married_couple-4.jpg)
కాసేపైనా నవ్వుకోండి
హాయిగా నవ్వుకోవడం వల్ల జీవితంలోని బాధల్ని మరిచిపోతాం. అందుకే భార్యాభర్తలు కలిసి నవ్వుకోవడం వల్ల వారి మనసుల్ని కూడా మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి ఖాళీ సమయాల్లో దంపతులిద్దరూ కలిసినప్పుడు అనవసర విషయాలతో కాలక్షేపం చేయకుండా జోక్స్, నవ్వు తెప్పించే చిన్నప్పటి సంగతులు వంటివి పంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి చేతిలో చెయ్యేసి కాసేపు అలా నడుస్తూ రొమాంటిక్ వాక్ చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే సమయం దొరికినప్పుడైనా ఇద్దరూ కలిసి తమకు నచ్చిన కామెడీ, రొమాంటిక్ సినిమాలు చూస్తుండాలి. ఇలా వీలైనప్పుడల్లా దంపతులిద్దరూ కలిసి రొమాంటిక్‌గా గడపడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.
![how to be a happy married couple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23519904_how_to_be_a_happy_married_couple-3.jpg)
నచ్చేలా.. మెచ్చేలా!
అయితే, దంపతులిద్దరూ రోజూ ఎవరి పనులతో వారు బిజీగా గడుపుతుంటారు. ఫలితంగా ఒకరినొకరు పట్టించుకునే సమయం దొరక్కపోవచ్చు. అయితే కనీసం సెలవు రోజునో, అలా బయటకు వెళ్లినప్పుడో, లేదంటే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాలప్పుడో ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా రెడీ కావాలని చెబుతున్నారు. అక్కడితో ఆగిపోకుండా ఆ క్షణం మీ భాగస్వామిపై మీకున్న ఫీలింగ్‌ని వారితో చెప్పేయాలని అంటున్నారు. దగ్గరికి తీసుకొని లేదంటే నుదుటిపై ఓ ముద్దు పెడుతూ, ప్రేమగా హత్తుకుంటూ రొమాంటిక్‌గా మీ మనసులోని భావాల్ని వ్యక్తం చేయాలని సూచిస్తున్నారు. ఇంకా 'నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావ్! నీ వల్ల చీరకే అందం వచ్చింది తెలుసా..', 'మీరు ఈ డ్రస్సులో మన్మథుడిలా ఉన్నారు' ఇలాంటివి చెబితే ఎదుటివారు ఎంతో హ్యాపీగా ఫీలవుతారట. ఇలా చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ హద్దులు దాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు.
![how to be a happy married couple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23519904_how_to_be_a_happy_married_couple-2.jpg)
![how to be a happy married couple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23519904_how_to_be_a_happy_married_couple-1.jpg)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇంట్లో వైర్లు, బోర్డులు బయటకు కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే రూమ్ అందంగా కనిపిస్తుందట!
మీ పిల్లలు ఫోన్ చూస్తూ సరిగ్గా చదవట్లేదా? ఇలా చేస్తే ఏకాగ్రత, ఇంట్రెస్ట్ పెరగుతుందని సలహా!