Minors Bike Riding : 18 ఏళ్లు దాటని మీ పిల్లలకు టూ వీలర్ ఇస్తుంటే ఇకనుంచి మానుకోండి. బండి నేర్చుకుంటున్నాడని, స్కూలు వరకే కదా అని, సరదా పడ్డాదని చాలామంది తల్లిదండ్రులు మైనర్లకు టూ వీలర్ ఇస్తున్నారు. ఇకనుంచి అలా మీ పిల్లలు దొరికితే పిల్లలతో పాటు తల్లిదండ్రులను అరెస్ట్ చేసే అవకాశముంది. రవాణాశాఖ నిబంధనల ప్రకారం వాహనాల డ్రైవింగ్ లైసెన్సు పొందే వయస్సు 18 సంవత్సరాలు. అంతకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు వాహనాలు నడుపుతూ రహదారులపై యథేచ్ఛగా తిరుగుతున్నారు. పిల్లలు వాహనాలు నడుపుతున్న తల్లిదండ్రులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు వారు కారణమవుతున్నారు. ఇది చట్ట ప్రకారం నేరమని, ప్రమాదం జరిగితే నడిపిన బాలలతో పాటు తల్లిదండ్రులు, వాహన యజమానికి కోర్టు శిక్షలు విధించే అవకాశం ఉందని రవాణా శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.
18 ఏళ్లు ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ : గతంలో 16 సంవత్సరాలు నిండితే 50 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉండి, గంటలకు 50 కిమీ మాత్రమే ప్రయాణించే బైక్లను నడిపేందుకు డ్రైవింగ్ లెసెన్స్ పొందేవారు. ప్రస్తుత బైక్లు 100 సీసీ కన్నా ఎక్కువే ఉంటున్నాయి. దీంతో ఈ నిబంధన వర్తించే పరిస్థితి లేదు. మోటార్ వెహికిల్ వాహన చట్టం ప్రకారం 18 సంవత్సరాల వయసు నిండిన వారికి మాత్రమే రవాణాశాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తున్నారు.
ప్రమాదాలకు కారణం : డ్రైవింగ్ లైసెన్సు పొందే టైంలో రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అధికారులు, సిబ్బంది సైతం వాహనదారులకు అవగాహన కల్పిస్తారు. 18 సంవత్సరాలలోపు బాలలకు రహదారి భద్రతా, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్స్, సూచిక బోర్డులు, రహదారిపై ఎలా వెళ్లాలనే అంశాలపై పట్టు లేకపోవడం, సరిగ్గా డ్రైవింగ్ రాకపోవడం, నియంత్రణ లేక ప్రమాదాలకు కారణం అవుతున్నారని అధికారులు అంటున్నారు.
తల్లిదండ్రులకూ శిక్ష తప్పదు : మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదం జరిగితే తల్లిదండ్రులకూ, వాహన యజమానికి చట్టరీత్యా శిక్ష విధించే అవకాశం ఉంది. కేసు నమోదైన తరువాత న్యాయస్థానంలో కేసు తీవ్రతను బట్టి న్యాయమూర్తి జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించవచ్చు. వాహనంపై కేసులు ఎక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. కేసు నమోదైతే బాలల భవిష్యత్తు పాడవుతుందని అధికారులు చెబుతున్నారు.